
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. అవి తనను తీవ్రంగా బాధించాయని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1978 నుంచి 2014 వరకు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నప్పటికీ తనపై ఎప్పుడూ ఇలాంటి ముద్ర పడలేదని గుర్తుచేశారు.
“మనకు ఈ రకమైన బ్రాండ్ రావడానికి ఎవరు కారణం? రాష్ట్ర ప్రతిష్ట ఇంతలా దిగజారిపోవడానికి ఎవరు కారణం?” అని చంద్రబాబు ప్రశ్నించారు. గతంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
ఏపీ రాజకీయాలపై వీహెచ్ వ్యాఖ్యలు
ఏపీలో స్థానిక ఎన్నికల నామినేషన్ల సమయంలో జరిగిన దాడులు, ఘర్షణలపై వీహెచ్ హనుమంతరావు స్పందించారు. “తెలంగాణ డిఫరెంట్, ఆంధ్ర డిఫరెంట్. వాళ్లకు కుమ్ముకోవడం, గుద్దుకోవడం తప్ప ఇంకేమీ తెలియదు. మాకు, వాళ్లకు తేడా ఇదే. మేము కలిసి ఉంటాం” అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ పండుగల సమయంలో అందరూ కలిసిపోతారని, అలాంటి సంస్కృతి ఏపీలోనూ రావాలని ఆకాంక్షించారు.
నామినేషన్ల సమయంలో ఘర్షణలు
ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్, పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పలు చోట్ల వివాదాలు, దాడులు, ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 31 అవాంఛనీయ ఘటనలు జరిగినట్లు డీజీపీ వెల్లడించినట్లు సమాచారం. ఈ పరిణామాలు పొరుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలోనూ చర్చకు దారితీశాయి. తాజా ఘటనల నేపథ్యంలో ఏపీ రాజకీయ వాతావరణం, రాష్ట్ర ప్రతిష్టపై నేతల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి.
