వైఎస్‌ షర్మిల కుమార్తె అంజలి వివాహ వేడుకకు వేదికగా బెంగళూరులోని తన నివాసాన్ని ఇచ్చేందుకు నిరాకరించిన అంశంపై వైఎస్సార్‌సీపీ స్పందించింది. ఈ వివాదంపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన చెల్లెలు షర్మిలకు రాసిన లేఖను పార్టీ విడుదల చేసింది. అందులో తన నిర్ణయానికి గల కారణాలను జగన్‌ వివరించారు.

భద్రత, వ్యక్తిగత గోప్యతే కారణం

బెంగళూరులోని తన నివాసంలో పెళ్లి వేడుక నిర్వహిస్తే పెద్ద సంఖ్యలో అతిథులు, కేటరింగ్‌ సిబ్బంది, ఈవెంట్‌ నిర్వాహకులు, ఫొటోగ్రాఫర్లు వస్తారని జగన్‌ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఇంటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు వెళ్లే అవకాశం ఉందని, ఇది తన కుటుంబ భద్రత, వ్యక్తిగత గోప్యతకు సమస్యగా మారవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

తన మేనకోడలు అంజలి జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే, కుటుంబ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. తన పిల్లలు హర్ష, వర్షల వివాహాల విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరిస్తానని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

లోటస్‌ పాండ్‌లో పెళ్లి చేసుకోవాలని సూచన

బెంగళూరు నివాసానికి బదులుగా హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌ను లేదా కన్వెన్షన్‌ సెంటర్‌ను వివాహ వేదికగా ఎంచుకోవచ్చని జగన్‌ సూచించినట్లు లేఖలో ఉంది. గతంలో రాజా వివాహానికి ఇచ్చినట్లుగానే ఇప్పుడు కూడా ఆ ప్రాంగణాన్ని ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తానని పేర్కొన్నారు. అంజలి పెళ్లి మధుర జ్ఞాపకంగా మిగిలేలా తన వంతు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

గత ఏడేళ్లుగా తమ మధ్య ఎన్ని పరిణామాలు చోటుచేసుకున్నా, అంజలి జీవితాంతం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

మరోవైపు, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే అధికార పక్షం జగన్‌, షర్మిల వ్యక్తిగత వ్యవహారాలను తెరపైకి తెస్తోందని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ వివాహ వేడుకకు సంబంధించిన వివాదం రాజకీయ చర్చకు దారితీసింది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *