
విజయవాడ నగర మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకోవడం ఖాయమని మేయర్ పదవికి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న వంగవీటి రాధాకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి లభిస్తున్న స్పందన ఆశీర్వాదాలే తనతోపాటు 86 మంది కూటమి అభ్యర్థుల విజయానికి సంకేతమని పేర్కొన్నారు.
ఆదివారం విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని మాచవరం, మొగల్రాజపురం, క్రీస్తురాజపురం, గుణదల తదితర ప్రాంతాల్లో కూటమి నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావుతో కలిసి వంగవీటి రాధాకృష్ణ ప్రజలను కలుసుకుని ఓట్లు అభ్యర్థించారు. ప్రచారానికి వచ్చిన కూటమి నేతలకు మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఎంపీ కేశినేని చిన్ని కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తుండగా, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు, బీజేపీ నేతలతో కలిసి సమన్వయంతో పనిచేస్తున్నామని చెప్పారు.
మూడు పార్టీలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తూ నాయకులు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల్లో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ప్రచారానికి వెళ్లిన ప్రతిచోటా ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. మరోవైపు గత రెండేళ్ల కూటమి పాలనలో విజయవాడ నగరంలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు.
వరదల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న చర్యలతో ప్రజలకు ఇబ్బందులు తగ్గాయని గుర్తుచేశారు. కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజల ఇళ్ల స్థలాల సమస్యకు కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపిందని చెప్పారు. దాదాపు 50 ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందని కొండ ప్రాంతాల పరిసరాల్లో సుమారు 26,500 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కల్పించామని కేశినేని చిన్ని వెల్లడించారు.
సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రజల ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వస్తోందని వ్యాఖ్యానించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణతోపాటు కూటమి తరఫున పోటీ చేస్తున్న 86 మంది అభ్యర్థులు విజయం సాధిస్తారని కేశినేని చిన్ని ధీమా వ్యక్తం చేశారు. అందరూ ఐక్యంగా సమన్వయంతో పనిచేస్తున్నామని తెలిపారు.
