
2023లో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్‌గా ఉన్న బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు ఆందోళన చేపట్టిన సంగతి గుర్తుందా? మహిళా రెజ్లర్లు ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతోపాటు.. ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టారు. తాజాగా ఈ కేసులో బ్రిజ్ భూషణ్‌కు ఊరట లభించింది. బ్రిజ్ భూషణ్‌తోపాటు వినోద్ తోమర్‌ను నిర్దోషిగా తేలుస్తూ ఢిల్లీ కోర్టు తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) మాజీ చీఫ్, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ కోర్టులో భారీ ఊరట లభించింది. ఆరుగురు మహిళా రెజ్లర్ల ఫిర్యాదు మేరకు నమోదైన లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్‌తోపాటు.. డబ్ల్యూఎఫ్ఐ అసిస్టెంట్ సెక్రటరీగా పని చేసిన వినోద్ తోమర్‌లను ఢిల్లీ న్యాయస్థానం నిర్దోషులుగా తేల్చింది. ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టులో అడిషనల్ చీఫ్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ అశ్వినీ పన్వార్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ కేసులో వాదనలు విన్న న్యాయస్థానం గురువారం తన తుది తీర్పును రిజర్వ్ చేసింది. మహిళా రెజ్లర్ల ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్‌పై 2023 జూన్ 15న ఛార్జ్‌షీట్ నమోదు చేశారు. ఐపీసీ 354, 354ఏ, 354డీ, 506 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదైంది.
తాజాగా కోర్టు తీర్పు అనంతరం బ్రిజ్ భూషణ్ మీడియాతో మాట్లాడారు. తాను ఏ తప్పు చేయలేదని, తనపై కుట్ర పన్నారని తాను మొదటి నుంచి చెబుతున్నానని.. తాను తప్పు చేశానని తేలితే తనకు తానుగా ఉరి వేసుకుంటానని మొదటి రోజు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కోర్టు తనను నిర్దోషిగా తేల్చిందని.. ఇది తనకు, తన అనుచరులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఈ రోజు తనకు ఎంతో సంతోషకరమైన రోజని ఆయన తెలిపారు. హక్కుల ఉల్లంఘనకు గురి అవుతోన్న జూనియర్ అథ్లెట్ల కోసం తాము పోరాడామని బ్రిజేష్ చెప్పుకొచ్చారు.

