శ్రీకాకుళం జిల్లాలో శరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారం పూర్ణాహుతితో ముగిశాయి. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని దుర్గాదేవి ఆలయాలకు భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో ఆలయాలన్నీ కిటకిటలాడాయి. చివరి రోజు అమ్మవారు రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

పాత శ్రీకాకుళంలోని సంతోషిమాత ఆలయంలో అర్చకుడు మోదుకూరి కిరణ్‌శర్మ వడిబియ్యం సమర్పించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని పలు ఆలయాల్లో చండీయాగాలు చేపట్టారు. కత్తెరవీధిలోని రాజరాజేశ్వరీ ఆలయంలో రఘుపాత్రుని శ్రీకాంత్‌ శిష్యబృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యరూపకాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

పాలకొండ రోడ్డులోని విజయగణపతి ఆలయం వద్ద కొత్త వాహనాలకు పూజలు చేయించేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. మొండేటివీధిలోని లలితశివకామేశ్వరీ అమ్మవారికి 51 రకాల పిండివంటలను నైవేద్యంగా సమర్పించారు. దీంతో నగరమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రజలు దసరా పండుగను భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకున్నారు.

మరోవైపు శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో నగరంలోని దుర్గాదేవి విగ్రహాల నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. కొందరు నిర్వాహకులు మంగళవారం నిమజ్జన కార్యక్రమాలను నిర్వహించగా మరికొందరు బుధవారం చేపట్టారు. అమ్మవారి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి నాగావళి నది పంటకాలువల్లో నిమజ్జనం చేశారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *