తమిళనాడు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. గతేడాది వెలుగులోకి వచ్చిన గ్రానైట్ వ్యాపారి లైంగిక వేధింపుల కేసును ఉపఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశంగా ప్రస్తావించారు. ఈ వ్యవహారంలో మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ వాస్తవాలను ప్రజలకు వెల్లడించకుండా దాచిపెట్టారని విజయ్ ఆరోపించారు. డీఎంకే ప్రభుత్వ హయాంలోనే బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు స్పందించలేదని ఆయన విమర్శించారు.

తమిళనాడులోని మధురాంతకం ఉపఎన్నికల ప్రచారంలో సీఎం, టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. బాలికలపై గ్రానైట్ వ్యాపారి ఆర్. వీరమణికి సంబంధించిన లైంగిక వేధింపుల కేసులో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై మాజీ సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎం.కే. స్టాలిన్ స్పందించాలని డిమాండ్ చేస్తూ.. ‘‘స్టాలిన్ సర్.. ఇకనైనా నోరు విప్పండి’’ అని విజయ్ ప్రశ్నించారు.

ఈ ఏడాది మేలో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మధురాంతకం నుంచి అన్నాడీఎంకే తరఫున కే. మరకతం కుమారవేల్ విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యే పదవికి ఆమె రాజీనామా చేసి టీవీకేలో చేరడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. టీవీకే తరఫున విజయ్ మళ్లీ ఆమెనే అభ్యర్థిగా బరిలోకి దించారు.

గురువారం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన విజయ్.. ‘‘తమిళనాడు ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. స్టాలిన్ సర్, మీరైనా ఈ అంశంపై నోరు విప్పండి. మీతో చేతులు కలిపిన అన్నాడీఎంకే కూడా స్పందించడం లేదు. ఇంత తీవ్రమైన కేసులోనూ మీ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందా? ఎందుకు మాట్లాడటం లేదు?’’ అంటూ ప్రశ్నించారు.

తన తల్లిపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా ఇంతకాలం సహించానని, అయితే తమిళనాడులోని తన సోదరీమణులు, తల్లులపై డీఎంకే నేతలు అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని మాత్రం ఏమాత్రం సహించబోనని టీవీకే అధ్యక్షుడు విజయ్ అన్నారు. డీఎంకే నేతలు, వారి కుటుంబసభ్యులు ఇలాంటి వ్యాఖ్యలను సమర్థిస్తున్నారని ఆయన ఆరోపించారు.

బాలికలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులోనూ విజయ్ డీఎంకే ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. గత డీఎంకే ప్రభుత్వ హయాంలోనే ఫిర్యాదు అందినప్పటికీ, కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.

బాలికలపై లైంగిక దాడికి సంబంధించిన వీడియో ఆధారాలను గతేడాది అక్టోబరులో బాలల హక్కుల కార్యకర్త పెన్‌డ్రైవ్‌లో పోలీసులకు అందజేశారు. అనంతరం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినప్పటికీ, తగిన ఆధారాలు లేవనే కారణంతో జెమ్ గ్రానైట్స్ ఛైర్మన్ ఆర్. వీరమణిని అరెస్టు చేయకుండా కేసును మూసివేసేందుకు అప్పటి ప్రభుత్వం ప్రయత్నించిందని విజయ్ ఆరోపించారు.

అయితే, ఇటీవల టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. పోక్సో ప్రత్యేక కోర్టు గతంలో సమర్పించిన క్లోజర్ నివేదికను తిరస్కరించి, సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది. దీంతో పోలీసులు ఆర్. వీరమణితో పాటు ఆయనకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శాంతి, ఆమె భర్త మహేంద్ర సింహన్‌లను ఆగస్టులో అరెస్టు చేశారు.

దర్యాప్తులో భాగంగా వీడియోలో కనిపించిన బాధితురాలిని పోలీసులు గుర్తించి, మేజిస్ట్రేట్ ఎదుట ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఇదే కేసుకు సంబంధించి ఘటనలు జరిగిన సమయంలో మైనర్లుగా ఉన్న మరికొందరు బాధితులను కూడా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. దీంతో కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.