
యూనివర్సిటీ హాస్టల్‌కు చెందిన విద్యార్థినిపై అత్యాచారం జరిగిందన్న ప్రచారం నేపథ్యంలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU)లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థుల ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో క్యాంపస్‌లో ఆస్తుల విధ్వంసం చోటుచేసుకుంది.
విద్యార్థులు పోలీసు వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు తమ సిబ్బందిపై రాళ్లు రువ్వారని పోలీసులు వెల్లడించారు. ఇదే సమయంలో యూనివర్సిటీ క్యాంపస్‌లోని మాల్లోనూ విద్యార్థులు విధ్వంసానికి పాల్పడి, అక్కడి వస్తువులను లూటీ చేసినట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఘటనకు దారితీసిన పరిస్థితులు, క్యాంపస్‌లో చోటుచేసుకున్న పరిణామాలు, వైరల్ అవుతున్న వీడియోలపై పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU)లో విద్యార్థిని అత్యాచారానికి గురైందన్న ప్రచారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కపుర్తలా జిల్లా ఫగర్వాలోని యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి క్రమంగా అదుపుతప్పింది.
క్యాంపస్‌లో ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో నిరసనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు. యూనివర్సిటీ ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు పోలీసు వాహనాలపై కూడా దాడి చేసినట్లు సమాచారం. అంతేకాకుండా జాతీయ రహదారి-44ను దిగ్బంధించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
దీంతో యూనివర్సిటీ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ ఆందోళనల నేపథ్యంలో యూనివర్సిటీలోని యునీ మాల్‌లోకి విద్యార్థులు చొరబడి, అక్కడి షాపుల్లోని ఆహారం, గ్యాడ్జెట్లు, ఇతర వస్తువులను తీసుకెళ్లినట్లు సమాచారం. మాల్లోని వస్తువులను చూపిస్తూ ఓ వ్యక్తి.. “మీకు ఏం కావాలి? ఆర్డర్ చేయండి.. అన్నీ ఉచితంగానే లభిస్తాయి” అని చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలాగే, పలువురు మాల్లో తిరుగుతూ ఉచితంగా షాపింగ్ చేశామని చెబుతున్న మరో వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ వీడియోలు నిజంగా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) క్యాంపస్‌లోనే చిత్రీకరించారా? అనే విషయం మాత్రం ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు.
