
పుణేలోని లోహ్‌గఢ్ కోట వద్ద జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో ఛార్జ్‌షీట్‌లో పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు. పెళ్లి ఇష్టం లేకపోవడంతో కాబోయే భార్య సియా గోయల్ తన ప్రియుడు చేతన్‌తో కలిసి కేతన్‌ను కోట అంచు నుంచి లోయలోకి తోసి హత్య చేసినట్లు ఓ ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.
హత్యను కళ్లారా చూసిన ఆ సాక్షి వెంటనే సియా, చేతన్‌లను ప్రశ్నించగా.. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే కేతన్‌కు పట్టిన గతే నీకూ పడుతుందని వారు బెదిరించినట్లు తెలిపారు. దీంతో భయంతో అప్పట్లో మౌనం వహించినట్లు చెప్పారు.
అయితే ఈ హత్య కేసు వార్తల్లోకి వచ్చిన తర్వాత ధైర్యం చేసి స్వయంగా పోలీసులను సంప్రదించి, జరిగిన విషయాన్ని పూర్తిగా వివరించినట్లు ఛార్జ్‌షీట్‌లో సాక్షి వాంగ్మూలం నమోదైంది.
మహారాష్ట్రలోని పుణే సమీపంలోని ప్రసిద్ధ లోహ్‌గఢ్ కోట వద్ద జరిగిన కేతన్ అగర్వాల్ దారుణ హత్య కేసు అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. తాజాగా ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
హత్యను ప్రత్యక్షంగా చూసిన ఓ సాక్షి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కీలక వివరాలను పోలీసులు ఛార్జ్‌షీట్‌లో నమోదు చేశారు. కేతన్‌ను అతని కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ కలిసి పక్కా ప్రణాళికతో కోట అంచు నుంచి లోయలోకి తోసి హత్య చేసినట్లు సాక్షి తెలిపినట్టు పోలీసులు పేర్కొన్నారు.
ఈ దారుణ ఘటన ఎలా జరిగింది? ప్రత్యక్ష సాక్షి పోలీసులకు ఏం చెప్పాడు? హత్య అనంతరం నిందితులు అతడిని ఎలా బెదిరించారు? ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పోలీసులు ఛార్జ్‌షీట్‌లో నమోదు చేసిన వివరాల ప్రకారం, ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన ఓ వ్యక్తి కీలక విషయాలను వెల్లడించారు. తన స్నేహితుడి కుటుంబంతో కలిసి లోహ్‌గఢ్ కోటను సందర్శించేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఆయన తెలిపారు.
తాము మెట్లు ఎక్కుతుండగా కేతన్, సియా గోయల్ తమకు ముందుగా నడుచుకుంటూ వెళ్లారని సాక్షి పేర్కొన్నారు. కొద్దిసేపటి తర్వాత తీవ్రమైన ఎండలోనూ హుడీ ధరించి అనుమానాస్పదంగా తిరుగుతున్న చేతన్ అనే యువకుడిని గమనించామని తెలిపారు. అతడిని ప్రశ్నించగా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఆలయం వద్దకు వెళ్లి కూర్చున్నాడని చెప్పారు.
ఆ తర్వాత కోట అంచు వద్ద సియా కూర్చొని ఉండగా, కేతన్ అక్కడ నిలబడి ఉన్నట్లు తాను చూశానని సాక్షి వెల్లడించారు. అదే సమయంలో సియా సైగలు చేస్తూ కేతన్ కాలిపై గట్టిగా తన్నిందని తెలిపారు.
ఇంతలో అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చిన చేతన్.. కేతన్‌ను ఒక్కసారిగా లోయలోకి తోసేశాడని ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం ఇచ్చారు. ఈ ఘటనతో షాక్‌కు గురైన తాను వారిని ప్రశ్నించగా, ఈ విషయం ఎవరికైనా చెబితే కేతన్‌కు పట్టిన గతే తనకూ పడుతుందని చేతన్ బెదిరించినట్లు తెలిపారు.
దీంతో భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సాక్షి చెప్పారు. అనంతరం ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలను వార్తల్లో తెలుసుకున్న తర్వాత ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించానని, జరిగిన విషయాన్ని వారికి వివరించానని వెల్లడించారు.
