తెలుగు దేశం పార్టీ అధిష్టానం తిరుపతి నియోజకవర్గానికి కొత్త ఇంఛార్జ్‌ను ప్రకటించింది. చంద్రబాబు ఆదేశాలతో తిరుపతి ఇంఛార్జ్‌గా జేబీ శ్రీనివాస్‌కు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జేబీ శ్రీనివాస్ ప్రస్తుతం టీడీపీ క్లస్టర్ ఇంఛార్జ్‌ పదవిలో ఉన్నారు. తిరుపతి నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో చర్చించిన టీడీపీ అధిష్టానం జేబీ శ్రీనివాస్‌ను ఎంపిక చేసింది. 2024 ఎన్నికల వరకు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పార్టీ ఇంఛార్జ్‌గా యాక్టివ్‌గా ఉన్నారు.. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు.

తిరుమల శ్రీవారి చెంత ఉన్న తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి తెలుగు దేశం పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. చాలాకాలంగా టీడీపీ ఇంఛార్జ్‌ లేకపోవడంతో కేడర్‌లో గందరగోళం కొనసాగుతున్న వేళ.. టీడీపీ అధిష్టానం తిరుపతి నియోజకవర్గ నేతలందరితో చర్చించింది. దాదాపు రెండేళ్ల తర్వాత నియోజకవర్గానికి కొత్త ఇంఛార్జ్‌ను ప్రకటించింది. తిరుపతి నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్‌గా జేబీ శ్రీనివాస్‌‌ను నియమించింది. అధినేత చంద్రబాబు ఆదేశాలతో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంఛార్జ్‌గా జేబీ శ్రీనివాస్‌ను నియమించినట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.

2024 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం సీటును జనసేన పార్టీకి కేటాయించారు. అక్కడి నుంచి ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి వరకు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. ఆమెను ఆంధ్రప్రదేశ్‌ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌గా నియమించారు. అప్పటి నుంచి పార్టీ కేడర్‌ను నడిపించే నాయకులు లేకుండా పోయారు.. ఇంతలో జేబీ శ్రీనివాస్ నియోజకవర్గంలో బాగా యాక్టివ్ అయ్యారు. కొంతకాలంగా తిరుపతి నియోజకవర్గంలో టీడీపీ తరఫున వాయిస్ వినిపిస్తూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో జేబీ శ్రీనివాస్‌ను టీడీపీ అధిష్టానం ఇంఛార్జ్‌గా నియమించింది. తిరుపతిలో సామాజిక సమీకరణాలను కూడా పరిగణలోకి తీసుకుని జేబీకి అవకాశం ఇచ్చింది. జేబీ శ్రీనివాస్ సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరారు.. ప్రస్తుతం టీడీపీ క్లస్టర్ ఇంఛార్జ్‌ పదవిలో ఉన్నారు.. ఇప్పుడు ఏకంగా నియోజకవర్గ ఇంఛార్జ్ పదవి దక్కింది.

తిరుపతి నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవిలు పోటీచేసిన చరిత్ర ఉంది. ఎన్టీఆర్ 1983లో విజయం సాధించారు.. ఆయన గుడివాడలో కూడా గెలవడంతో, తిరుపతిలో రాజీనామా చేశారు. 1983లో జరిగిన తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి శ్యామల గెలిచారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి 2009 ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీచేసి విజయం సాధించారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయగా.. 2012లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. చిరంజీవి రాజ్యసభ ఎంపీగా కేంద్రమంత్రి పదవిని దక్కించుకున్నారు.