
నీట్ పేపర్ లీకేజ్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలకు టీడీపీ ఎంపీ కుమార్తె మద్దతు తెలపడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కుమార్తె స్నిగ్ధ సోషల్ మీడియా పోస్టులు వైరల్ అవుతున్నాయి. అలాగే ఆమె నేరుగా ఉద్యమంలో పాల్గొని ప్లకార్డులు ప్రదర్శించారని ఫోటో కూడా వైరల్ అవుతోంది. అయితే ప్రస్తుతం ఆ పోస్టులు సోషల్ మీడియాలో కనిపించడం లేదు.
నీట్ పేపర్ లీకేజ్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు, సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి.. పరిస్థితి లాఠీఛార్జ్‌ల వరకు వెళ్లింది. ఇటు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షతో ఉద్యమం మరింత ఉధృతమైంది.. ఆయన్ను ఆస్పత్రికి తరలించడం, ఆ తర్వాత ఆయన దీక్ష విరమించడం, సీజేపీతో చర్చలు వంటివి చకచకా జరిగిపోయాయి. అనంతరం నాటకీయ పరిణామాల మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. యువత ఆకాంక్షలను గౌరవిస్తూ రాజీనామా చేస్తున్నానని.. వారి భవిష్యత్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రకటించారు.
ఈ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలకు ఎన్డీఏ కూటమి ఎంపీ కుమార్తెలు కూడా మద్దతు తెలపడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. భువనేశ్వర్ నుంచి బీజేపీ ఎంపీ అపరాజితా సారంగి కుమార్తె అర్చితా సచిన్‌తో పాటుగా అసోంలో బీజేపీతో పోత్తులో ఉన్న ఏజీపీ నేత మంత్రి కేశబ్ మహంత కుమార్తె దిబిసా మహంత కూడా ఉన్నారు. తాజాగా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని కుమార్తె కేశినేని స్నిగ్ధ కూడా సీజేపీకి, విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ పోస్టుల్ని కొంతమంది వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు వైరల్ చేస్తున్నారు. అయితే కేశినేని స్నిగ్ధ తన సోషల్ మీడియా పోస్టుల్ని డిలీట్ చేశారు.. ప్రస్తుతం అవి కనిపించడం లేదు.
ఒక విద్యార్థిగా మన దేశంలో జరుగుతున్నది చూస్తుంటే నిజంగా హృదయ విదారకంగా ఉంది. ఇటీవలే నీట్ పరీక్షల నిర్వహణలో విఫలమైన ఒక మంత్రిని జవాబుదారీతనం అడిగినందుకు విద్యార్థులపై ఇంతటి క్రూరత్వం, బలాన్ని ప్రయోగిస్తారా. ప్రభుత్వం సమాధానం ఇవ్వడంలో విఫలమైనప్పుడు మేము ఎవరిని ఆశ్రయించాలి? నేను విద్యార్థుల పక్షాన నిలబడతాను. ప్రభుత్వం నుంచి జవాబుదారీతనం, సమాధానాలు కావాలి’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత విద్యార్థులు, సీజేపీ చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా మరికొన్ని పోస్టులు కూడా షేర్ చేశారు. అలాగే కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంపై కూడా స్పందించారు.

