
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ టీడీపీ అభ్యర్థి ఆస్తుల వివరాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. చిత్తూరు జిల్లా గుడిపాల జెడ్పీటీసీ స్థానానికి టీడీపీ తరఫున పోటీ చేస్తున్న మమత శ్రీ తన కుటుంబానికి రూ.172.27 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. ఇందులో రూ.162.99 కోట్ల స్థిరాస్తులు, రూ.9.28 కోట్ల చరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. అదే సమయంలో కుటుంబానికి రూ.32 కోట్ల మేర అప్పులు ఉన్నట్లు తెలిపారు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఆస్తులు, అప్పుల వివరాలను నామినేషన్‌తో పాటు సమర్పించే అఫిడవిట్లో వెల్లడించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా గుడిపాల నుంచి బరిలో ఉన్న మమత శ్రీ సమర్పించిన అఫిడవిట్‌లోని ఆస్తుల వివరాలు ఆసక్తికరంగా మారాయి.
అఫిడవిట్ ప్రకారం.. మమత శ్రీ పేరుతో రెండు స్కూటీలు, 1.10 కిలోల బంగారం, 15 కిలోల వెండి ఉన్నాయి. ఆమె భర్త మొగిలీశ్వర నాయుడు పేరుతో మూడు ట్రాన్స్పోర్ట్ వాహనాలు, మూడు కాంక్రీట్ మిక్సర్ ట్రక్కులు ఉన్నట్లు వెల్లడించారు.
స్థిరాస్తుల విషయానికి వస్తే.. భర్త మొగిలీశ్వర నాయుడు పేరుతో రూ.119.80 కోట్ల విలువైన ఆస్తులు, మమత శ్రీ పేరుతో రూ.43.64 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. వీటిలో 44.62 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు రూ.24.89 కోట్ల విలువైన నివాస భవనాలు ఉన్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం ప్రాంతంతో పాటు కర్ణాటకలోనూ తమకు ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు.
ఇక అప్పుల విషయానికొస్తే.. మమత శ్రీ, ఆమె భర్త కలిపి మొత్తం రూ.32 కోట్ల రుణాలు తీసుకున్నట్లు అఫిడవిట్లో పొందుపరిచారు. మరోవైపు ఆమె భర్త మొగిలీశ్వర నాయుడు వ్యాపార కార్యకలాపాలతో పాటు ‘ఈశ్వర అభయ’ పేరుతో ఫౌండేషన్ నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు సమాచారం.
మొత్తంగా గుడిపాల జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మమత శ్రీ కుటుంబ ఆస్తుల వివరాలు వెలుగులోకి రావడంతో స్థానికంగా చర్చ జరుగుతోంది. ఒక జెడ్పీటీసీ అభ్యర్థి కుటుంబానికి ఇంత భారీ మొత్తంలో ఆస్తులు ఉండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.
