
గుంటూరు మేయర్ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. చివరి రోజు ప్రచారంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరు పెంచారు. ఈ నేపథ్యంలో కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిగా మేయర్ బరిలో నిలిచిన కోవెలమూడి లక్ష్మీ అపర్ణకు ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు మద్దతు ప్రకటించారు. ఆమెతో పాటు కూటమి తరఫున కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
ఈ వీడియోలో జగపతిబాబు గుంటూరు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు భారీ మెజార్టీతో విజయాన్ని అందించిన ప్రజలు.. ఇప్పుడు తన చెల్లి కోవెలమూడి లక్ష్మీ అపర్ణకు కూడా అదే స్థాయిలో మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆమెను గుంటూరు మేయర్‌గా గెలిపించాలని కోరారు.
లక్ష్మీ అపర్ణకు మంచి మనసు ఉందని, ఆమె సమర్థురాలని జగపతిబాబు పేర్కొన్నారు. గుంటూరు నగర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆమె కృషి చేస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. లక్ష్మీ అపర్ణతో పాటు కూటమి తరఫున బరిలో ఉన్న కార్పొరేటర్ అభ్యర్థులను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
‘గుంటూరు ప్రజలకు నా నమస్కారం. కార్పొరేషన్ ఎన్నికల్లో నా చెల్లి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ కూటమి తరఫున మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించండి. ప్రజలు తెలివైనవారు. వారికి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. అయినప్పటికీ నా తరఫున ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించారు. అదే ఆదరణతో మా చెల్లి లక్ష్మీ అపర్ణను కూడా గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఆమెకు మంచి మనసుంది, సమర్థురాలు. గుంటూరుకు మంచి చేస్తారనే నమ్మకం నాకుంది. అలాగే కూటమి తరఫున పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థులను కూడా గెలిపించండి’ అని జగపతిబాబు వీడియో సందేశంలో కోరారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారం అక్టోబర్ 30తో ముగియనున్న నేపథ్యంలో జగపతిబాబు విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
