
: ధరణి పోర్టల్ ద్వారా జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భూ అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో వెలుగుచూసిన భూ యాజమాన్య మార్పులు, ప్రభుత్వ భూముల అక్రమ బదిలీలు, సాంకేతిక లోపాల దుర్వినియోగం వంటి అంశాలపై మరింత లోతైన విచారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
సిట్‌లో రెవెన్యూ, పోలీస్, సైబర్ క్రైమ్, ఐటీ శాఖలకు చెందిన అనుభవజ్ఞులైన సీనియర్ అధికారులకు చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. సాంకేతికంగా జరిగిన మార్పులను గుర్తించడంతో పాటు, వాటి వెనుక ఉన్న వ్యక్తులు, నెట్‌వర్క్‌ను వెలికితీయడమే ఈ బృందం ప్రధాన లక్ష్యంగా ఉండనుంది.
ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన 2020 సంవత్సరం నుంచి జరిగిన అనుమానాస్పద భూ లావాదేవీలను సిట్ పరిశీలించనుంది. మ్యుటేషన్లు, యాజమాన్య హక్కుల మార్పులు, నిషేధిత జాబితాలోని భూముల బదిలీలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జరిగిన మార్పులపై ప్రత్యేక దృష్టి సారించనుంది.
రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి సహా పలు జిల్లాల్లో వేలాది ఎకరాల భూముల హక్కులు అనుమానాస్పదంగా మారినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు కూడా అక్రమంగా బదిలీ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. విచారణలో భాగంగా ఇప్పటికే పలు జిల్లాల్లో అనుమానితులను ప్రశ్నిస్తున్న అధికారులు, ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు అక్రమాల లింకులు ఉన్నట్లు గుర్తిస్తున్నట్లు సమాచారం.
రెవెన్యూ అధికారులు, ధరణి ఆపరేటర్లు, మాజీ ఆపరేటర్లు, దళారులు, మరికొందరు కీలక వ్యక్తుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.

