రాజమహేంద్రవరం పేపర్ మిల్లు వ్యవహారంపై స్థానిక ఎంపీ, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ఎంత ముఖ్యమో.. అవి నిబంధనలు పాటించడం కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. పేపర్ మిల్లు నుంచి పన్ను బకాయిలు, పెనాల్టీలు ఎలా వసూలు చేయాలో సంబంధిత మంత్రి పవన్ కల్యాణ్‌కు బాగా తెలుసన్నారు.

గతంలో పేపర్ మిల్లు కాలుష్యంపై ఫిర్యాదులు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదని పురందేశ్వరి అన్నారు. పరిశ్రమలు నిబంధనలు ఉల్లంఘిస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. పరిశ్రమల యాజమాన్యాలు సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

స్థానిక ఎన్నికలపై బీజేపీ ఫోకస్

రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని బలోపేతం చేయడమే తమ లక్ష్యమని పురందేశ్వరి తెలిపారు. కూటమి పార్టీలన్నీ సమన్వయంతో సీట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటాయని, ప్రత్యేక ఫార్ములా ఏమీ లేదన్నారు.

బీజేపీ అధికారాన్ని చలాయించేందుకు కాకుండా ప్రజాసేవకు ఒక మాధ్యమంగా ఉపయోగించుకునే పార్టీ అని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. అమరావతి అభివృద్ధికి రూ.2,500 కోట్లు, అనంతపురం–అమరావతి ఎక్స్‌ప్రెస్‌వేకు రూ.29 వేల కోట్లు, అమరావతి ఔటర్ రింగ్‌రోడ్‌కు సుమారు రూ.20 వేల కోట్ల మేర కేంద్రం సహకరిస్తోందని తెలిపారు.

సెప్టెంబర్ 8న బీజేపీ కార్యక్రమాలు

రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సెప్టెంబర్ 8న 100 ప్రాంతాల్లో బీజేపీ జెండాలను ఆవిష్కరించనున్నట్లు పురందేశ్వరి తెలిపారు. అనంతరం కంబాలచెరువు వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు.

సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప అభియాన్’ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినమైన సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ప్రజలు ఇళ్లలో, దేవాలయాల్లో దీపాలు వెలిగించి ఆయనకు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని ప్రార్థించాలని పురందేశ్వరి విజ్ఞప్తి చేశారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *