
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి పదవీకాలం నేటితో ముగియనుంది. 2024 నవంబర్ 1న కూటమి ప్రభుత్వం టీటీడీ ఛైర్మన్గా బీఆర్ నాయుడిని, 26 మంది సభ్యులతో పాలకమండలిని నియమించింది. రెండేళ్ల పదవీకాలం అక్టోబర్ 31తో పూర్తవుతోంది. దీంతో కొత్త పాలకమండలి నియామకంపై ఆసక్తి నెలకొంది.
కొత్త పాలకమండలి ఏర్పాటుపై ఉత్కంఠ
దేవదాయ చట్టం ప్రకారం టీటీడీ పాలకమండలి పదవీకాలం రెండేళ్లు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో కొత్త పాలకమండలి నియామకంపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాతే కొత్త పాలకమండలి ఏర్పాటు చేసే అంశంపై నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం.
అయితే అప్పటివరకు టీటీడీ నిర్వహణ కోసం స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేసే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది.
టీటీడీ ఛైర్మన్ రేసులో ఇద్దరు ఎమ్మెల్యేలు?
కొత్త పాలకమండలి ఏర్పాటుపై చర్చ మొదలవడంతో తదుపరి ఛైర్మన్ ఎవరనే అంశం ఆసక్తికరంగా మారింది. టీడీపీకి చెందిన ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
- కిమిడి కళా వెంకట్రావు: విజయనగరం జిల్లా చీపురుపల్లి ఎమ్మెల్యే.
- జ్యోతుల నెహ్రూ: జగ్గంపేట ఎమ్మెల్యే, ప్రస్తుత టీటీడీ పాలకమండలి సభ్యుడు.
వీరితో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆధ్యాత్మికవేత్త శ్రీనివాస రామానుజం పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే కొత్త పాలకమండలి ఎప్పుడు ఏర్పాటవుతుంది? తదుపరి ఛైర్మన్గా ఎవరిని నియమిస్తారు? అనే అంశాలపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
