ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి అభ్యర్థులకు వ్యతిరేకంగా రెబల్స్‌గా ఎన్నికల బరిలో నిలిచిన 11 మంది నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయా జిల్లాల టీడీపీ అధ్యక్షులు ప్రకటించారు.

ఏయే జిల్లాల్లో ఎవరిపై వేటు పడిందంటే?

  • విజయనగరం జిల్లా: రామభద్రపురం మండలానికి చెందిన సామంతుల ఉమామహేశ్వరరావు, పూసపాటిరేగ మండలానికి చెందిన పుసుపులేటి లలిత కళ.
  • అల్లూరి సీతారామరాజు జిల్లా: ఎటపాక మండల మాజీ అధ్యక్షుడు మువ్వా శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ దొంతు మంగేశ్వరరావు.
  • కృష్ణా జిల్లా: పామర్రుకు చెందిన టీడీపీ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు నన్నపనేని వీరేంద్ర.
  • తిరుపతి జిల్లా: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన దొడ్డరెడ్డి రామకృష్ణారెడ్డి.
  • చిత్తూరు జిల్లా: పాలసముద్రం మండలానికి చెందిన బి. ఇందిరమ్మ, ఆమె కుమార్తె సి. శిరీష.
  • కర్నూలు జిల్లా: ఆలూరుకు చెందిన బెంగళూరు కిశోర్, హోళగుండకు చెందిన గోవిందు గౌడ్.
  • శ్రీ సత్యసాయి జిల్లా: పరిగి మండలానికి చెందిన బోయ నాగప్ప.

రెబల్స్‌కు చంద్రబాబు ముందస్తు హెచ్చరిక

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడిగా నిర్ణయించిన అభ్యర్థులకే పార్టీ నేతలు, కార్యకర్తలు మద్దతు ఇవ్వాలని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా రెబల్స్‌గా పోటీ చేసినా, కూటమి ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేసినా సస్పెన్షన్ తప్పదని హెచ్చరించారు.

టికెట్లు ఆశించినప్పటికీ కొన్ని రాజకీయ సమీకరణాల కారణంగా అవకాశం దక్కని వారికి భవిష్యత్తులో తగిన అవకాశాలు కల్పిస్తామని కూడా భరోసా ఇచ్చారు. అయినప్పటికీ పార్టీ ఆదేశాలను ధిక్కరించి ఎన్నికల బరిలో నిలిచిన 11 మందిపై అధిష్టానం చర్యలు తీసుకుంది. ఈ పరిణామం జిల్లాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *