భారత ఉక్కు మనిషి, దేశ తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 151వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 31న నిర్వహించే ఈ వేడుకల్లో భాగంగా ఢిల్లీతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రముఖులు పటేల్‌కు ఘన నివాళులర్పించారు. ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి నివాళులు

దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక స్మారక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ సర్దార్ పటేల్‌కు పుష్పాంజలి ఘటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధూ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పటేల్ దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. మహారాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సైతం ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పించారు.

పటేల్‌ను అఖండ భారత్ శిల్పిగా కొనియాడిన ప్రధాని మోదీ

సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. పటేల్‌ను ‘అఖండ భారత్ శిల్పి’గా అభివర్ణించారు.

బలమైన సమర్థవంతమైన, స్వయంసమృద్ధి కలిగిన భారతదేశ నిర్మాణం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. పటేల్ చేసిన త్యాగాలు, అందించిన సేవలు వికసిత భారత్ నిర్మాణానికి నిరంతరం స్ఫూర్తినిస్తాయని ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *