ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సామగ్రి పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. నగరంలోని లయోలా కళాశాల ప్రాంగణంలో ఎన్నికల సామగ్రిని సిబ్బందికి అందజేస్తున్నారు.

విజయవాడలోని 85 డివిజన్లకు కార్పొరేటర్ల ఎన్నికలతో పాటు మేయర్ ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లు చేపట్టారు. పోలింగ్ సామగ్రి పంపిణీ ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయవాడ నగరంలో ఒక డివిజన్ ఇప్పటికే ఏకగ్రీవమైందని తెలిపారు. మిగిలిన 85 డివిజన్లకు ఆదివారం ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పటిష్ఠమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

నగరవ్యాప్తంగా మొత్తం 848 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వివరించారు. ఎన్నికల విధుల్లో పోలీసు సిబ్బందితో కలిపి సుమారు 10 వేల మంది అధికారులు సిబ్బంది పాల్గొంటున్నారని తెలిపారు.

ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 150 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర వెల్లడించారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *