
D Spiritual: Oct 31: శ్రీశైలంలో వైభవంగా ఆరుద్రోత్సవం.. స్వర్ణరథంపై మల్లన్న, అమ్మవార్ల ఊరేగింపు
శ్రీశైలం: ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శనివారం శ్రీశైలంలో ఆరుద్రోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లు స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వర్ణరథంపై కొలువుదీరిన స్వామి, అమ్మవార్లను చూసి భక్తులు పరవశించిపోయారు.
ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వర్ణరథోత్సవానికి ఏర్పాట్లు చేసి స్వామి, అమ్మవార్లను రథంపై ఆశీనులను చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక సంకల్పాన్ని పఠించారు.
దేశం శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని, అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని అర్చకులు ప్రార్థించారు. దేశం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని, అకాల మరణాలు సంభవించకుండా ఉండాలని ఆకాంక్షించారు. అలాగే అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు జరగకుండా ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని కోరుతూ ప్రత్యేక సంకల్పం నిర్వహించారు. అనంతరం రథంపై కొలువుదీరిన స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు సమర్పించారు.
శివనామస్మరణతో సాగిన స్వర్ణరథోత్సవం
భక్తుల శివనామస్మరణ, వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వర్ణరథోత్సవం ప్రారంభమైంది. గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు స్వర్ణరథాన్ని ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
ఆకట్టుకున్న జానపద కళారూపాలు
సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా స్వర్ణరథోత్సవంలో పలు కళాబృందాల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. కోలాటాలు, తప్పెట చిందులు తదితర జానపద కళారూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయంలోని వివిధ విభాగాల అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
