
ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తొలిసారిగా అవినీతి ఆరోపణలు చేశాయి. సీఎం కొత్త కార్యాలయ నిర్మాణానికి టెండర్లు పిలవకుండానే పనులు ప్రారంభించడమే ఇందుకు కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
నామక్కల్ కవింజర్ మాళిగైలో కొత్త భవన నిర్మాణ పనులు ఇప్పటికే జరుగుతున్నాయని, అయితే టెండర్ల ప్రక్రియ మాత్రం ఇప్పుడు చేపడుతున్నారని బీజేపీ విమర్శించింది. ఈ వ్యవహారంపై డీఎంకే కూడా స్పందించింది. ఇది ముఖ్యమంత్రి వ్యక్తిగత వ్యవహారమని, తాము ఇందులో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. అయితే, వార్తాపత్రికల్లో వచ్చిన నివేదికలపై ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని డీఎంకే డిమాండ్ చేసింది.
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త కార్యాలయానికి మారాలన్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సిబ్బందికి మరింత వర్క్‌స్పేస్ కల్పించాలనే ఉద్దేశంతో ప్రస్తుత కార్యాలయాన్ని ఫోర్ట్ సెయింట్ జార్జ్ నుంచి చెన్నైలోని నామక్కల్ కవింజర్ మాళిగైకి తరలించాలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అక్కడ నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం.
కొత్త కార్యాలయ ఏర్పాట్ల కోసం టీవీకే ప్రభుత్వం ఇటీవల రూ.5.5 కోట్ల విలువైన పనులకు టెండర్లను ఆహ్వానించింది. అయితే నిర్మాణ పనులు ప్రారంభించిన నెల రోజుల తర్వాత టెండర్ నిబంధనలు విడుదల చేయడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. టీవీకే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా అవినీతి ఆరోపణలు కూడా ఈ వ్యవహారంపైనే వెల్లువెత్తుతున్నాయి.
100 రోజుల్లోనే విమర్శలు
బీజేపీ నేత సి.ఆర్. కేశవన్ ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. టెండర్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటిస్తామని ప్రభుత్వం చెప్పిన మాటలకు, తాజాగా ప్రముఖ దినపత్రికలో వచ్చిన కథనానికి మధ్య భారీ వ్యత్యాసం ఉందని విమర్శించారు.
సీఎం విజయ్ కొత్త కార్యాలయానికి సంబంధించిన రూ.5.5 కోట్ల టెండర్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆ కథనం పేర్కొంటోందని ఆయన అన్నారు. టెండర్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 100 రోజులు మాత్రమే పూర్తయిన సమయంలోనే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటోందని కేశవన్ వ్యాఖ్యానించారు
డీఎంకే ఎమ్మెల్యే స్పందన
ఈ వ్యవహారంపై డీఎంకే ఎమ్మెల్యే ఈవీ వేలు కూడా స్పందించారు. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని మార్చుకోవడం విజయ్ వ్యక్తిగత నిర్ణయమని, ఇందులో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. నామక్కల్ కవింజర్ మాళిగై భవనాన్ని కళైజ్ఞర్ కరుణానిధి నిర్మించినందున, సీఎం అక్కడికి కార్యాలయాన్ని మార్చుకోవడం పట్ల తాము సంతోషంగానే ఉన్నామని తెలిపారు.
అయితే, టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ ఓ దినపత్రికలో వచ్చిన కథనంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఈవీ వేలు డిమాండ్ చేశారు. ఆన్లైన్లో కూడా టెండర్ పిలవకుండానే పనులు ప్రారంభించి, అనంతరం టెండర్‌ను ఆహ్వానించినట్లు వార్తా కథనాలు పేర్కొంటున్నాయని ఆయన అన్నారు. టెండర్లలో పారదర్శకత పాటిస్తామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో, ఈ ఆరోపణలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఆరోపణలపై టీవీకే వివరణ
ప్రతిపక్షాల ఆరోపణలపై టీవీకే ప్రభుత్వం స్పందించింది. ఈ ఆరోపణలను మంత్రి అధవ అర్జున ఖండించారు. మీడియాలో వచ్చిన కొన్ని నివేదికల్లో వాస్తవాలు లేవని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి తనతో పాటు పనిచేసే అధికారులు, సిబ్బందికి కూడా మెరుగైన, సౌకర్యవంతమైన కార్యస్థలం ఉండాలని భావిస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం అధికారులు, సిబ్బంది 100 చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణంలో పనిచేస్తున్నారని, అందుకే సీఎం కార్యాలయాన్ని తాత్కాలికంగా మరో భవనానికి మార్చాలని నిర్ణయించినట్లు వివరించారు.
ముఖ్యమంత్రి విజయ్ సాధారణ జీవనశైలిని ఇష్టపడతారని, ప్రచార సమయంలోనూ సాధారణ హోటల్లో లేదా వ్యాన్‌లో విశ్రాంతి తీసుకోవడానికి ఆయన ఎలాంటి సంకోచం చూపలేదని అధవ అర్జున పేర్కొన్నారు. కార్యాలయ మార్పు వెనుక సౌకర్యం, పరిపాలనా అవసరాలే తప్ప ఇతర ఉద్దేశాలు లేవని ఆయన స్పష్టం చేశారు.

