ఏపీలో వినాయక చవితి వేడుకలకు సంబంధించి పోలీస్‌ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గణేష్ మండపాల ఏర్పాటుకు అవసరమైన అనుమతుల కోసం సింగిల్ విండో ఆన్‌లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గణేష్ ఉత్సవ కమిటీలు ganeshutsav.net పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా సూచించారు.

పోలీస్, అగ్నిమాపక, మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ శాఖల అనుమతులు, క్లియరెన్స్‌లను ఒకే పోర్టల్‌ ద్వారా పొందేలా ఈ విధానాన్ని రూపొందించారు. దరఖాస్తు అనంతరం సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ అధికారులు మండపాన్ని పరిశీలిస్తారు. నిబంధనలకు అనుగుణంగా ఉంటే క్యూఆర్ కోడ్‌తో కూడిన ఎన్‌ఓసీ జారీ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా ఉచితం కాగా.. ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని పోలీసులు తెలిపారు.

మండపాల నిర్వాహకులు విగ్రహం, మండపం, మైకులు, ఫ్లెక్సీలు, విగ్రహం ఎత్తు, ఉత్సవాల నిర్వహణ రోజుల వివరాలను దరఖాస్తులో పేర్కొనాలి. అలాగే నిమజ్జనం తేదీ, సమయం, ఊరేగింపు మార్గం వివరాలను కూడా వెల్లడించాలి.

వినాయక నవరాత్రి వేడుకలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీసులు పలు సూచనలు చేశారు. మండపాల వద్ద అసభ్యకర ప్రదర్శనలు నిర్వహించరాదని, నిమజ్జనానికి మద్యం సేవించి రావద్దని స్పష్టం చేశారు. మండపాల వద్ద, ఊరేగింపుల్లో డీజేలకు అనుమతి లేదని తెలిపారు. ఉత్సవ కమిటీలు నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని సూచించారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *