
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంతో పోలీసులు, అధికారులు కుమ్మక్కయ్యారని వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి వైసీపీ అభ్యర్థులు, నాయకులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆయన విమర్శించారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర పోలీసు యంత్రాంగంపై తమకు నమ్మకం లేదని పేర్కొన్న బొత్స సత్యనారాయణ, ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని డిమాండ్ చేశారు. పోలీసుల అండతో కూటమి గూండాలు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం అధికారులు అమలు చేయడం లేదని విమర్శించారు.
నామినేషన్ కేంద్రాలకు వస్తున్న వైసీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను లాక్కొని చించివేస్తున్నారని బొత్స ఆరోపించారు. ఇలాంటి చర్యలతో ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతోందని అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
మరో రెండున్నరేళ్లలో వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం స్థానిక ఎన్నికల్లో చోటుచేసుకుంటున్నాయని తాము ఆరోపిస్తున్న అక్రమాలపై న్యాయవిచారణ జరిపిస్తామని తెలిపారు. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని భావించే కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
