అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలోని గన్నెల గ్రామంలో ‘సంజీవని హెల్త్‌కేర్ ప్రాజెక్ట్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గిరిజన కుటుంబాల ఆరోగ్యం, వంట ఇంధనంపై కీలక ప్రకటన చేశారు.
కట్టెల పొయ్యిల నుంచి వచ్చే పొగతో ఇళ్లలో వాయు కాలుష్యం పెరిగి, దీర్ఘకాలంలో శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉందని సీఎం తెలిపారు. గిరిజన కుటుంబాలు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యుత్, ఇండక్షన్ వంటి శుభ్రమైన వంట పద్ధతులను వినియోగించాలని సూచించారు.
విద్యుత్ పొయ్యికి మారితే 3 సిలిండర్ల డబ్బులు
ప్రభుత్వం అమలు చేస్తున్న దీపం 2.0 పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే గ్యాస్‌కు బదులుగా విద్యుత్ లేదా ఇండక్షన్ ద్వారా వంట చేసుకునే గిరిజన కుటుంబాలకు ప్రత్యేక ప్రయోజనం కల్పిస్తామని చంద్రబాబు ప్రకటించారు.
మూడు గ్యాస్ సిలిండర్లకు అయ్యే డబ్బును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని సీఎం తెలిపారు. దీంతో కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం కలగడంతో పాటు కట్టెల పొగను తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెప్పారు.
‘సంజీవని’ కార్యక్రమం ద్వారా వైద్య సేవలను మెరుగుపరచడంతో పాటు, వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. స్వచ్ఛమైన వంట పద్ధతులను ప్రోత్సహించడం, ఆరోగ్య సేవలను డిజిటల్ చేయడం, గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
