తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని కబురు. నైరుతి రుతుపవనాలు వెనుతిరగడంతో కొద్ది రోజులుగా ఏపీ, తెలంగాణలో వర్షాలు లేవు. ఈ క్రమంలో వాతావరణశాఖ తీపికబురు అందించింది. రాబోయే మూడ్రోజులు ఏపీ, తెలంగాణకు వర్షసూచన జారీ చేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.

నైరుతి రుతుపవనాలు దేశం మొత్తం నుంచి పూర్తిగా ఉపసంహరించుకున్నాయి. అదే సమయంలో దిగువ ట్రోపోస్ఫియరిక్ స్థాయిలలో దక్షిణ కోస్తా తమిళనాడు, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దక్షిణ ద్వీపకల్ప భారతదేశం, దక్షిణ, మధ్య, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫియరిక్ స్థాయిలలో తూర్పు/ఈశాన్య దిశల నుంచి గాలులు వీయడం ప్రారంభమైంది. గత 24 గంటల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌తో పాటు వాటికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, దక్షిణ రాయలసీమ ప్రాంతాల్లో విస్తృతంగా వర్షపాతం నమోదైంది ఇదే సమయంలో, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ వర్షపాతం నమోదైంది. అలాగే తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో అనేక ప్రదేశాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. దీంతో పాటు మన్నార్ గల్ఫ్, పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ కోస్తా తమిళనాడు ప్రాంతంలో కొనసాగుతూ, సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంది. అలాగే దక్షిణ కోస్తా తమిళనాడులోని ఉపరితల ఆవర్తనం నుంచి ఒడిశా తీరానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం వరకు, నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ద్రోణి విస్తరించి ఉంది. ఇది సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడనున్నాయి.

వాతావరణ సూచనలు ఇవే..

ఈ రోజు తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఇక ఎల్లుండి తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన ఉరుములతో పాటు గంటకు 30–40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ఏపీకి వర్షసూచన

అటు ఏపీకి కూడా వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. రాబోయే మూడ్రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాలకు పిడుగుపాటు హెచ్చరికలు కూడా జారీ చేసింది. పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముంది. దీంతో ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *