
తమిళనాడు రాజకీయాల్లో నటి త్రిష పేరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, త్రిష మధ్య సంబంధం ఉందంటూ కొంతకాలంగా పుకార్లు, ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమెపై కొందరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యవహారం రాజకీయంగానూ దుమారం రేపుతోంది.
ఇటీవల ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ఓ సభలో త్రిష పేరును ప్రస్తావించడంతో వివాదం మరింత ముదిరింది. దీంతో తంజావూరులో టీవీకే కార్యకర్తలు ఉదయనిధిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ నిమిత్తం ఆయనను అరెస్ట్ చేశారు. తాజాగా అన్నాడీఎంకేకు చెందిన ఓ నేత కూడా త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది.
తమిళనాడు రాజకీయాల్లో మహిళలను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు మరోసారి వివాదానికి దారితీశాయి. నటి త్రిషను ఉద్దేశించి ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఇప్పటికే రాజకీయ దుమారం కొనసాగుతోంది.
తాజాగా అన్నాడీఎంకే నేతలు కూడా త్రిష పేరును ప్రస్తావిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలో అన్నాడీఎంకే సీనియర్ నేత ఆర్‌బీ ఉదయ్‌కుమార్ త్రిషను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ఉపముఖ్యమంత్రిగా త్రిషను ఎప్పుడు నియమిస్తారంటూ ఆయన ప్రశ్నించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
పార్టీ కార్యక్రమంలో అన్నాడీఎంకే సీనియర్ నేత ఆర్‌బీ ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి విజయ్‌కు ‘ప్రియమైన’ త్రిషను డిప్యూటీ సీఎంగా ఎప్పుడు నియమిస్తారో తమిళనాడు ప్రజలంతా ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
అదే సమయంలో కావేరీ నదీ జలాల నిర్వహణ అథారిటీ ఆదేశాలు ఉన్నప్పటికీ కర్ణాటక నుంచి తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఉదయ్‌కుమార్ విమర్శించారు. ఆగస్టు 8న తూత్తుకుడిలో జరిగిన ‘జయలలిత పేరవై’ సమావేశంలో అన్నాడీఎంకే కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించే సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

