
కేరళకు చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి సరోజం రాధాకృష్ణన్ రొమ్ము కేన్సర్‌తో బాధపడ్డారు. వ్యాధి అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో గుర్తించడంతో ఆమెకు శస్త్రచికిత్స చేసే అవకాశం లేకపోయింది. దీంతో నోవార్టిస్ సంస్థ తయారు చేసిన రిబోసిక్లిబ్ అనే ఔషధాన్ని వినియోగించాల్సి వచ్చింది.
అయితే, ఈ మందుల ఖర్చు ఆమెకు అందే నెలవారీ పెన్షన్ కంటే దాదాపు రెట్టింపుగా ఉండేది. దీంతో పేటెంట్ ఔషధాలను ప్రభుత్వం స్వయంగా తయారు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సరోజం రాధాకృష్ణన్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు.
అయితే, పిటిషన్‌పై విచారణ పూర్తికాకముందే ఆమె మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కేరళ హైకోర్టు సుమోటాగా స్వీకరించి, కేసును కొనసాగించింది.
ప్రాణాలు కాపాడే కేన్సర్ ఔషధాలు అత్యంత ఖరీదైనవిగా మారడంతో, వాటి ఖర్చును భరించలేక న్యాయం కోసం కోర్టును ఆశ్రయించిన ఓ మహిళ పోరాటం చారిత్రక తీర్పుకు దారితీసింది. అయితే, విచారణ పూర్తయ్యేలోపే ఆమె కన్నుమూశారు. నాలుగేళ్లకు పైగా సాగిన ఈ కేసులో కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
మార్కెట్‌లో ధరలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న పేద రోగుల కోసం పేటెంట్ పొందిన ప్రాణరక్షక ఔషధాలను ప్రభుత్వం స్వయంగా తయారు చేయవచ్చని, లేదా మరో సంస్థకు వాటి తయారీకి అనుమతి ఇచ్చి సరఫరా చేయవచ్చని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ హరిశంకర్ వి. మీనన్ ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
పేటెంట్ చట్టం, 1970లోని సెక్షన్ 100 ప్రకారం ప్రభుత్వ అవసరాల కోసం పేటెంట్ పొందిన ఆవిష్కరణలను వినియోగించే అధికారం ప్రభుత్వానికి ఉందని ధర్మాసనం పేర్కొంది. ఔషధాల ధరలు అధికంగా ఉన్న పరిస్థితుల్లో, వాటిని అవసరమైన రోగులకు వాణిజ్యేతర ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకురావడం కూడా ప్రభుత్వ బాధ్యతల్లో భాగమేనని వ్యాఖ్యానించింది.
అయితే, పేటెంట్ పొందిన ఔషధాల తయారీని వెంటనే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించలేదు. ఔషధాల అందుబాటు, ప్రాణరక్షక మందులు అవసరమయ్యే రోగుల సంఖ్య, ప్రస్తుతం అమల్లో ఉన్న సబ్సిడీ పథకాల ప్రభావం వంటి అంశాలపై పూర్తి సమాచారాన్ని సేకరించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఈ తీర్పుతో అధిక ధరల కారణంగా ప్రాణరక్షక ఔషధాలకు దూరమవుతున్న పేద రోగులకు ప్రభుత్వ జోక్యానికి ఒక కీలక న్యాయపరమైన మార్గం ఏర్పడినట్టైంది.
రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న కేరళకు చెందిన రిటైర్డ్ మహిళా బ్యాంకు ఉద్యోగి సరోజం రాధాకృష్ణన్ 2022 జూన్ 2న కేరళ హైకోర్టును ఆశ్రయించారు. నెలకు రూ.28,000 పెన్షన్‌పై ఆధారపడుతున్న ఆమెకు, స్విట్జర్లాండ్‌కు చెందిన నొవార్టిస్ సంస్థ తయారు చేసే ‘రిబోసిక్లిబ్’ (Ribociclib) ఔషధం చికిత్సలో భాగంగా అవసరమైంది. రోజుకు మూడు మాత్రల చొప్పున 21 రోజుల కోర్సుకు ఈ మందు ఖర్చు సుమారు రూ.58,140గా ఉండేది.
ఈ ఔషధం అధిక ధర కారణంగా సాధారణ రోగులకు కూడా అందుబాటులో ఉండేలా పేటెంట్ చట్టంలోని అధికారాలను వినియోగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆమె హైకోర్టును కోరారు. అయితే, ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగుతుండగానే సరోజం రాధాకృష్ణన్ కన్నుమూశారు.
ఆమె మరణం అనంతరం, 2022 సెప్టెంబర్ 16న కేరళ హైకోర్టు ఈ అంశాన్ని ‘ఇన్ రీ ఎగ్జార్బిటెంట్ ప్రైసింగ్ ఆఫ్ లైఫ్ సేవింగ్ పేటెంటెడ్ మెడిసిన్స్’ పేరుతో సుమోటో కేసుగా స్వీకరించింది. ప్రాణరక్షక పేటెంట్ పొందిన ఔషధాల అధిక ధరలపై విచారణ చేపట్టిన కోర్టు, ఈ వ్యవహారంలో సహకరించేందుకు న్యాయవాది మైత్రేయి సచిదానంద హెగ్డేను అమికస్ క్యూరీగా నియమించింది.
