
మధ్యప్రదేశ్‌లోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఉజ్జయినిలో చేపడుతున్న అభివృద్ధి పనులు వివాదానికి దారితీశాయి. 2028లో క్షిప్రా నది తీరంలో సింహస్థ కుంభమేళా జరగనున్న నేపథ్యంలో, భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి నుంచే మౌలిక వసతుల అభివృద్ధి, రహదారుల విస్తరణ వంటి పనులను చేపడుతోంది.
ఈ క్రమంలో పురాతన ఓ మసీదు కాంప్లెక్స్‌లోని కొంత భాగాన్ని తొలగించడం వివాదాస్పదంగా మారింది. అభివృద్ధి పనుల పేరుతో నిర్మాణాన్ని కూల్చివేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఉజ్జయినిలో చేపడుతున్న రహదారి విస్తరణ పనులు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
2028లో క్షిప్రా నది తీరంలో జరగనున్న సింహస్థ కుంభమేళా ఏర్పాట్లలో భాగంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉజ్జయినిలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు ఉద్రిక్తతలకు దారితీశాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన షాహీ మసీదు కాంప్లెక్స్ సమీపంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టే సమయంలో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య రాళ్లదాడి జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
రోడ్డు విస్తరణలో భాగంగా షాహీ మసీదులోని కొంత భాగాన్ని తొలగిస్తున్న సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో కొందరు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. స్వల్పంగా లాఠీఛార్జ్ కూడా చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF)తో పాటు భారీగా పోలీసు బలగాలను అక్కడ మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఉజ్జయిని ఎస్పీ ప్రదీప్ శర్మ మాట్లాడుతూ, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించినట్లు తెలిపారు. మసీదు కమిటీ ప్రతినిధుల సమక్షంలో, వారి సమ్మతితోనే రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు.
అయితే, కొందరు వ్యక్తులు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ రాళ్లదాడికి పాల్పడ్డారని ఎస్పీ పేర్కొన్నారు. డ్రోన్లు, సీసీటీవీ కెమెరాల ద్వారా ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఇదిలా ఉండగా, కొందరు మహిళలు రహదారిని దిగ్బంధించేందుకు ప్రయత్నించినప్పటికీ, పోలీసులు వారికి పరిస్థితిని వివరించడంతో వారు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారని ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం రహదారిపై రాకపోకలు కొనసాగుతున్నాయని చెప్పారు.
అభివృద్ధి పనుల పేరుతో 600 ఏళ్ల చారిత్రక కట్టడాన్ని కూల్చివేయడాన్ని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ తీవ్రంగా వ్యతిరేకించారు. రోడ్డు విస్తరణ కోసం కట్టడం ఉన్న వైపున కాకుండా ప్రత్యామ్నాయంగా మరో వైపు భూమిని సేకరించాలని, ప్రజల మనోభావాలను ప్రభుత్వం గౌరవించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
ఈ అంశంపై కోర్టులో కేసు విచారణలో ఉన్న సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని ఎంపీ పేర్కొన్నారు. ‘‘మసీదును పదేపదే ముట్టడించడం ద్వారా ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటోంది?’’ అని ఆయన ప్రశ్నించారు.
ఉజ్జయినిలో వేలాది మంది యువకులు ఈ అంశంపై నిరంతరం తమ గళాన్ని వినిపిస్తున్నారని ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ అన్నారు. చారిత్రక, వారసత్వ ప్రాధాన్యత కలిగిన ఈ కట్టడాన్ని కూల్చివేయడాన్ని సాధారణ విషయంగా పరిగణించలేమని ఆయన స్పష్టం చేశారు.
