
D news: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి కూడా శాసనసభ సమావేశాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గైర్హాజరు కావాలని నిర్ణయించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ అసెంబ్లీకి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో చట్టసభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు.
ఆగస్టు 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు సుమారు నాలుగు రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. అయితే సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏయే అంశాలను అజెండాలో చేర్చాలనే విషయాలను అదే రోజు జరిగే శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో నిర్ణయించనున్నారు.
ప్రధాన ప్రతిపక్ష హోదా విషయంలో వైసీపీ తన నిరసనను కొనసాగించనుంది. అయితే శాసనమండలి సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి తూమాటి మాధవరావును వైసీపీ ఎంపిక చేసినట్లు సమాచారం.
వైసీపీ శాసనసభాపక్ష సమావేశం వివరాలను పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు. డీఎస్సీ వ్యవహారంలో అక్రమాలపై తమ పోరాటం కొనసాగుతుందని, చట్టసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన తెలిపారు. డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో రెండు పక్షాలే ఉన్నాయని పేర్కొన్న బొత్స.. 40 శాతం ఓట్లు సాధించిన వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ప్రజా తీర్పును గౌరవించడం లేదని విమర్శించారు.
మరోవైపు రానున్న అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జిల్లాల అభివృద్ధి, అమరావతి, మెగా డీఎస్సీ, పరిశ్రమలు-పెట్టుబడులు, భోగాపురం విమానాశ్రయం తదితర కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.

