ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. జగజ్జేతగా టీమిండియా

Date:

టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ జగజ్జేతగా అవతరించింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా వరుసగా రెండు ఎడిషన్లలో ఛాంపియన్‌గా నిలిచిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ పోరులో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత్.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో మూడోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది.

భారత క్రికెట్ జట్టు ఈ విజయంతో కొత్త రికార్డు సృష్టించింది. ఆదివారం గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో కివీస్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. అనంతరం న్యూజిలాండ్‌ను కేవలం 159 పరుగులకే ఆలౌట్ చేసి, భారీ విజయాన్ని నమోదు చేసింది.

256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు ఏ దశలోనూ భారత బౌలర్లను ఎదుర్కోలేకపోయింది. సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై విజయంలో కీలకపాత్ర పోషించిన ఫిన్ అలెన్ ఈసారి పెద్దగా రాణించలేదు. 7 బంతుల్లో 9 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అనంతరం రచిన్ రవీంద్ర (1), గ్లెన్ ఫిలిప్స్ (5), మార్క్ చాప్‌మన్ (3) త్వరగా పెవిలియన్ చేరడంతో కివీస్ జట్టు 47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

ఒకవైపు వికెట్లు పడుతున్నా.. విధ్వంసకర ఓపెనర్ టిమ్ సెఫర్ట్ క్రీజులో ఉండటంతో న్యూజిలాండ్ ఆశలు కొంతసేపు కొనసాగాయి. అయితే వరుణ్ చక్రవర్తి అతనికి చెక్ పెట్టాడు. 26 బంతుల్లో 52 పరుగులు చేసిన సెఫర్ట్‌ను ఔట్ చేయడంతో మ్యాచ్ దాదాపు భారత్ వైపే మళ్లింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ బ్యాటర్లు పెద్దగా ప్రతిఘటన చూపలేకపోయారు. చివరకు న్యూజిలాండ్ జట్టు 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీసి కివీస్‌పై ఒత్తిడి పెంచాడు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ ఒక్కో వికెట్ సాధించారు. వికెట్‌కీపర్ ఇషాన్ కిషన్ కూడా అద్భుత ఫీల్డింగ్‌తో మెరిశాడు. టిమ్ సెఫర్ట్, రచిన్ రవీంద్ర, డేరిల్ మిచెల్ క్యాచ్‌లు పట్టి న్యూజిలాండ్‌ను తక్కువ స్కోరుకు పరిమితం చేయడంలో కీలకపాత్ర పోషించాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ భారీ స్కోరు చేయడంలో టాప్ ఆర్డర్ బ్యాటర్లు కీలకపాత్ర పోషించారు. సంజూ శాంసన్ 46 బంతుల్లో 89 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, అభిషేక్ శర్మ 21 బంతుల్లో 52 పరుగులు చేసి దూకుడుగా ఆడాడు. ఇషాన్ కిషన్ 25 బంతుల్లో 54 పరుగులతో మెరిశాడు. ఈ ముగ్గురు బ్యాటర్ల దూకుడు ఇన్నింగ్స్‌తో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

ఈ విజయంతో టీమిండియా టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకుంది. 2024లో రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ ఈ ట్రోఫీని గెలుచుకుంది. తాజాగా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి మరోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. మొత్తంగా టీమిండియా టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకోవడం ఇది మూడోసారి. 2007లో మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలో, 2024లో రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ విజేతగా నిలిచింది. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో మూడోసారి టీమిండియా పొట్టి ప్రపంచకప్‌ను అందుకుంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...