APPSC Group 1 Exam Pattern: ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు APPSC గ్రూప్-1 నోటిఫికేషన్ 2026 మంచి అవకాశం. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో మొత్తం 166 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, జిల్లా విద్యాధికారి తదితర పోస్టులు ఇందులో ఉన్నాయి. అర్హతలు, వయోపరిమితి, జీతం, ఎంపిక విధానం, పరీక్ష ప్యాటర్న్ పూర్తి వివరాలు తెలుసుకోండి. దరఖాస్తులకు చివరి తేదీ 2026 అక్టోబరు 27 కాగా, స్క్రీనింగ్ పరీక్ష 2027 జనవరి 24న నిర్వహించనున్నారు..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు గ్రూప్-1 సర్వీసులు మంచి అవకాశం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) తాజాగా 166 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల్లో జిల్లా విద్యాధికారి (DEO), డీఎస్పీ కమ్యూనికేషన్ వంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్క్రీనింగ్ పరీక్షను 2027 జనవరి 24న నిర్వహించనున్నారు. ఈ నియామక ప్రక్రియలో వివిధ ప్రభుత్వ శాఖల్లోని పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
APPSC గ్రూప్ 1 పోస్టుల వివరాలు
- డిప్యూటీ కలెక్టర్ పోస్టుల సంఖ్య: 12
- అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ పోస్టుల సంఖ్య: 14
- డీఎస్పీ (సివిల్) పోస్టుల సంఖ్య: 36
- డీఎస్పీ (కమ్యూనికేషన్స్) పోస్టుల సంఖ్య: 3
- డీటీఓ పోస్టుల సంఖ్య: 14
- ఆర్డీఓ పోస్టుల సంఖ్య: 3
- జిల్లా రిజిస్ట్రార్ పోస్టుల సంఖ్య: 1
- డిప్యూటీ రిజిస్ట్రార్ (కోఆపరేటివ్ సర్వీసెస్) పోస్టుల సంఖ్య: 16
- పురపాలక కమిషనర్ గ్రేడ్-2 పోస్టుల సంఖ్య: 12
- అసిస్టెంట్ ట్రెజరీ/అకౌంట్స్ అధికారి పోస్టుల సంఖ్య: 2
- జిల్లా ఉపాధి కల్పన అధికారి పోస్టుల సంఖ్య: 3
- అసిస్టెంట్ ఆడిట్ అధికారి పోస్టుల సంఖ్య: 15
- డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి పోస్టుల సంఖ్య: 35
చాలా గ్రూప్ 1 పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే డీఎస్పీ (కమ్యూనికేషన్స్) పోస్టులకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ లేదా రేడియో ఇంజినీరింగ్ విభాగాల్లో బీఈ/బీటెక్ అర్హత అవసరం. కొన్ని పోస్టులకు ప్రత్యేక విద్యార్హతలు లేదా శారీరక ప్రమాణాలు ఉండవచ్చు. కాబట్టి అభ్యర్థులు తాము దరఖాస్తు చేయాలనుకుంటున్న పోస్టుకు సంబంధించిన అధికారిక నిబంధనలను పరిశీలించాలి. 2026 జులై 1 నాటికి పోస్టును బట్టి కనీస వయస్సు 18 ఏళ్లు ఉండాలి. నాన్-యూనిఫాం పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్ల వరకు ఉంది. యూనిఫాం పోస్టులకు వయోపరిమితి, శారీరక ప్రమాణాలు వేర్వేరుగా ఉండవచ్చు. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు APPSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకుని దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి.
ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే..?
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నియామక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది.
స్క్రీనింగ్ టెస్ట్
మొదట ఆబ్జెక్టివ్ విధానంలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. స్క్రీనింగ్ పరీక్ష మొత్తం 240 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి సంబంధిత ప్రశ్నకు కేటాయించిన మార్కులో మూడో వంతు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. అందువల్ల అభ్యర్థులు ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. తెలియని ప్రశ్నలకు ఊహించి సమాధానాలు గుర్తించడం వల్ల మార్కులు కోల్పోయే అవకాశం ఉంది.
