కాఫీ తాగడం వల్ల శరీరంలో కొవ్వు తగ్గుతుందా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. కాఫీలో ఉండే కెఫీన్ జీవక్రియపై కొంత ప్రభావం చూపవచ్చు. అయితే కాఫీ తాగినంత మాత్రాన శరీరంలోని కొవ్వు తగ్గిపోతుందని చెప్పలేమని పరిశోధనలు సూచిస్తున్నాయి. మరి బరువు నియంత్రణలో కాఫీ ఎలాంటి పాత్ర పోషిస్తుంది? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.


కాఫీ తాగడం చాలామందికి రోజువారీ అలవాటుగా మారిపోయింది. అయితే కాఫీ వినియోగానికి శరీరంలోని కొవ్వు, కండరాల పరిమాణానికి మధ్య సంబంధం ఉండవచ్చని తాజా అధ్యయనం సూచిస్తోంది. ఎక్కువగా కాఫీ తాగే వారిలో మొత్తం శరీర కొవ్వుతో పాటు పొట్టలోని అంతర్గత కొవ్వు స్థాయులు తక్కువగా ఉండగా, కండరాల పరిమాణం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే కాఫీ తాగడం వల్లే ఈ మార్పులు సంభవిస్తాయని నిర్ధారించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరం.


ఫిన్లాండ్‌లోని ఓలు విశ్వవిద్యాలయ పరిశోధకులు 1966 నార్తర్న్ ఫిన్లాండ్ బర్త్ కోహోర్ట్‌కు చెందిన 46 ఏళ్ల వయసున్న 2,264 మంది ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించారు. వారి కాఫీ తాగే అలవాట్లు, శరీరంలోని కొవ్వు పరిమాణం, కండరాల స్థాయి తదితర అంశాలను పోల్చి పరిశీలించారు. ఈ విశ్లేషణ ఆధారంగా కాఫీ వినియోగానికి, శరీర కూర్పులోని మార్పులకు మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించారు.

అధ్యయనంలో వెల్లడైన ఆసక్తికర విషయాలు

ఎక్కువగా కాఫీ తాగే వారిలో శరీర నిర్మాణానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా వీరిలో శరీర కొవ్వు శాతం, మొత్తం కొవ్వు పరిమాణం తక్కువగా ఉండటంతో పాటు, అంతర్గత అవయవాల చుట్టూ పేరుకునే విసెరల్‌ ఫ్యాట్‌ కూడా తక్కువగా ఉన్నట్లు గమనించారు. అదే సమయంలో అస్థిపంజర కండరాల పరిమాణం ఎక్కువగా ఉండగా, రక్తంలో కొన్ని బ్రాంచ్డ్‌-చైన్‌ అమైనో ఆమ్లాల (BCAAలు) స్థాయులు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఎక్కువగా, తక్కువగా కాఫీ తాగే వ్యక్తుల మధ్య బాడీ మాస్‌ ఇండెక్స్‌ (BMI)లో గణనీయమైన తేడా కనిపించలేదు. BMI అనేది ఒక వ్యక్తి ఎత్తు, బరువు ఆధారంగా శరీర బరువు స్థితిని అంచనా వేసే కొలమానం. అయితే ఇది శరీరంలోని కొవ్వు, కండరాల పరిమాణాన్ని నేరుగా తెలియజేయదు. అందువల్ల ఒకే BMI ఉన్న వ్యక్తుల్లో కూడా కొవ్వు, కండరాల నిష్పత్తి భిన్నంగా ఉండవచ్చు.

కాఫీ తాగితే నిజంగానే కొవ్వు తగ్గుతుందా?

కాఫీలో ఉండే కెఫిన్‌ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపడంతో పాటు శరీరం శక్తిని వినియోగించే విధానంలోనూ మార్పులు తీసుకురావచ్చు. కెఫిన్‌ వల్ల శక్తి వినియోగం కొంత పెరగడం, ఆకలిలో మార్పులు రావడం, జీవక్రియపై ప్రభావం పడటం వంటి అంశాలను గతంలో జరిగిన కొన్ని పరిశోధనలు సూచించాయి.

తాజా అధ్యయనంలోనూ ఎక్కువగా కాఫీ తాగే అలవాటుకు తక్కువ శరీర కొవ్వు, ఎక్కువ కండరాల పరిమాణం వంటి లక్షణాలతో సంబంధం ఉన్నట్లు వెల్లడైంది. అయితే కాఫీ తాగడం వల్లే కొవ్వు తగ్గుతుందని ఈ పరిశోధన నిర్ధారించలేదు. పరిశోధకులు వ్యక్తుల కాఫీ వినియోగం, శరీర నిర్మాణానికి సంబంధించిన వివరాలను పరిశీలించగా, ఈ రెండింటి మధ్య సంబంధాన్ని మాత్రమే గుర్తించారు. కాబట్టి కాఫీ తాగడమే కొవ్వు తగ్గడానికి కారణమని కచ్చితంగా చెప్పలేం. శరీర బరువు, కొవ్వు నియంత్రణ కోసం సమతుల ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, తగినంత నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *