చల్లని వాతావరణంలోనూ రాత్రివేళ నిద్రలో విపరీతంగా చెమట పడుతుందా? అయితే దీనిని నిర్లక్ష్యం చేయకండి. రాత్రిపూట అధికంగా చెమట పట్టడానికి థైరాయిడ్‌ సమస్యలు, ఒత్తిడి, మెనోపాజ్‌ వంటి అనేక కారణాలు ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచూ ఇదే సమస్య ఎదురవుతుంటే కారణాన్ని గుర్తించేందుకు వైద్యులను సంప్రదించడం మంచిది.

రాత్రిపూట నిద్రలో చెమట పట్టడం చాలామందిలో కనిపించే సాధారణ సమస్యే. గది ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం, దుప్పట్లు ఎక్కువగా కప్పుకోవడం లేదా రోజంతా అధిక శారీరక శ్రమ చేయడం వంటి కారణాలతో చెమట పట్టడం సహజమే. అయితే వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ.. ఫ్యాన్‌, ఏసీ పనిచేస్తున్నా నిద్రలో పదేపదే విపరీతంగా చెమట పడుతుంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఇలా తరచూ జరగడానికి శరీరంలో హార్మోన్ల మార్పులు, ఒత్తిడి లేదా కొన్ని ఆరోగ్య సమస్యలు కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ సమస్య తరచుగా వేధిస్తుంటే అసలు కారణాన్ని గుర్తించడం అవసరం.

థైరాయిడ్‌ సమస్య కారణం కావచ్చు

థైరాయిడ్‌ గ్రంథి శరీర జీవక్రియను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది అవసరానికి మించి చురుగ్గా పనిచేసే హైపర్‌థైరాయిడిజం పరిస్థితిలో శరీరంలో వేడి ఎక్కువగా అనిపించడంతో పాటు అధికంగా చెమట పట్టవచ్చు. కొందరిలో రాత్రివేళ నిద్రలోనూ చెమటలు పట్టడం కనిపించొచ్చు.

ఒత్తిడి, ఆందోళనతోనూ చెమటలు

అధిక ఒత్తిడి, ఆందోళన సమయంలో శరీరంలో ఒత్తిడి ప్రతిస్పందనలు చోటుచేసుకుంటాయి. గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస వేగం పెరగడం, కండరాలు బిగుసుకుపోవడం వంటి లక్షణాలతో పాటు చెమటలు కూడా పట్టవచ్చు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు రాత్రిపూట చెమటలు పట్టే అవకాశం కూడా ఉంటుంది.

మెనోపాజ్‌లో సాధారణంగా కనిపించొచ్చు

ముఖ్యంగా మధ్య వయసులో మహిళల్లో రాత్రిపూట అకస్మాత్తుగా చెమటలు పట్టడం మెనోపాజ్‌ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులతో సంబంధం కలిగి ఉండొచ్చు. ఈ సమయంలో ముఖం, మెడ, ఛాతి ప్రాంతాల్లో ఒక్కసారిగా వేడి అనిపించి, ఆ తర్వాత చెమటలు పట్టడం వంటి హాట్‌ ఫ్లాషెస్‌ కనిపించవచ్చు.

కొన్ని మందుల వల్ల కూడా ఇలా జరగొచ్చు

కొన్ని రకాల మందుల దుష్ప్రభావంగా కూడా రాత్రిపూట చెమటలు పట్టవచ్చు. కొన్ని యాంటీడిప్రెసెంట్లు, మధుమేహానికి ఉపయోగించే మందులు, స్టెరాయిడ్లు, ఎసిటామినోఫెన్‌, ఆస్పిరిన్‌, కొన్ని రక్తపోటు మందులు ఇందుకు కారణం కావచ్చు. ఏదైనా కొత్త మందు ప్రారంభించిన తర్వాత ఈ సమస్య మొదలైతే వైద్యులకు సమాచారం ఇవ్వాలి. మందులను మాత్రం సొంతంగా నిలిపివేయకూడదు.

రాత్రిపూట చెమటలు తగ్గాలంటే..

  • పడుకునే గది చల్లగా, గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవాలి.
  • నిద్రకు ముందు కెఫిన్‌, ఆల్కహాల్‌, ఎక్కువ కారంగా ఉండే ఆహారాన్ని తగ్గించడం మంచిది.
  • మెనోపాజ్‌ సమయంలో సమతుల్య ఆహారం తీసుకుంటూ, ఆరోగ్యకరమైన బరువును కొనసాగించేందుకు ప్రయత్నించాలి.
  • క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
  • ఒత్తిడి, ఆందోళన తగ్గించేందుకు రిలాక్సేషన్‌ పద్ధతులు, శ్వాసాభ్యాసాలు లేదా నచ్చిన పనులకు సమయం కేటాయించడం ఉపయోగపడవచ్చు.
  • మందులు ప్రారంభించిన తర్వాతే రాత్రిపూట చెమటలు పెరిగితే వైద్యులను సంప్రదించి కారణాన్ని తెలుసుకోవాలి.

రాత్రిపూట చెమటలు అప్పుడప్పుడు రావడం సాధారణం కావచ్చు. అయితే చల్లని గదిలోనూ తరచూ విపరీతంగా చెమటలు పడటం, నిద్రకు అంతరాయం కలగడం లేదా ఇతర లక్షణాలు కూడా కనిపిస్తే వైద్యులను సంప్రదించి కారణాన్ని తెలుసుకోవడం మంచిది.