పచ్చని అడవుల్లో సరికొత్త చరిత్ర.. 50 ఏళ్ల తర్వాత తొలిసారి రెపరెపలాడిన త్రివర్ణ పతాకం!

Date:

కాలం మారింది.. కర్రెగుట్టల కథ కూడా మారింది.. ఒకప్పుడు మావోయిస్టుల కదలికలు, బాంబుల మోతతో దద్దరిల్లిన ఆ ప్రాంతంలో ఇప్పుడు శాంతి సందేశం వినిపిస్తోంది. హింసకు నిలయంగా మారిన కర్రెగుట్టల్లో కొత్త అధ్యాయం మొదలైంది. నిన్నటి రక్తపు జ్ఞాపకాలను చెరిపేస్తూ.. అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నాయి.

దట్టమైన అడవులు.. ఎత్తైన కొండలు.. అడుగు తీసి అడుగు వేయడమే సాహసంగా మారిన కర్రెగుట్టల్లో ఇప్పుడు త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. రాష్ట్ర డీజీపీ స్వయంగా జాతీయ జెండాను ఆవిష్కరించి.. అక్కడ శాంతికి కొత్త ప్రతీకగా నిలిచారు. గతంలో కాల్పులు, పేలుళ్లతో మారుమోగిన ప్రాంతంలో శాంతికపోతాలను ఎగురవేస్తూ.. ఇక నుంచి అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

మావోయిస్టుల ప్రభావం నుంచి బయటపడుతున్న కర్రెగుట్టల్లో రహదారులు, మౌలిక వసతులు, విద్య, వైద్యం వంటి అభివృద్ధి పనులకు బాటలు పడుతున్నాయి. భద్రతా బలగాల అడుగులతో పాటు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆ ప్రాంత ప్రజల్లో కొత్త ఆశలు నింపుతున్నాయి. ఒకప్పుడు భయానికి చిరునామాగా ఉన్న కర్రెగుట్టలు.. ఇప్పుడు ప్రశాంతతకు, ప్రగతికి ప్రతీకగా మారుతున్నాయి.

అయితే ఈ మార్పు ఒక్కరోజులో సాధ్యమైనది కాదు. ఎన్నో సవాళ్లు.. ఎన్నో భద్రతా చర్యలు.. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత కర్రెగుట్టల్లో ఈ కొత్త వాతావరణం ఏర్పడింది. మరి ఇంతటి మార్పు ఎలా సాధ్యమైంది..? కర్రెగుట్టల ప్రగతి ప్రయాణం ఏ దిశగా సాగుతోంది..?

కర్రెగుట్టల్లో చరిత్రాత్మక అడుగు పడింది. ప్రకృతి అందాలకు ఆలవాలమైన.. తెలంగాణలోనే అత్యంత ఎత్తైన కొండలు కలిగిన కర్రెగుట్టలపైకి రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ చేరుకున్నారు. ఒకప్పుడు తుపాకుల మోతతో, హింసాత్మక ఘటనలతో మారుమోగిన ఈ ప్రాంతంలో ఇప్పుడు ప్రశాంత వాతావరణం నెలకొనడంపై ఆయన పరవశం వ్యక్తం చేశారు. నిత్యం రక్తం పారిన నేలపై.. తుపాకులు గర్జించిన బాటలో శాంతికి ప్రతీకగా శాంతి కపోతాలను గాల్లోకి ఎగురవేశారు. కర్రెగుట్టల్లో శాంతి, భద్రత నెలకొనడం చరిత్రలో నిలిచిపోయే రోజని డీజీపీ సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు.

తెలంగాణ–చత్తీస్‌గఢ్‌ సరిహద్దు అడవుల్లో ఒకప్పుడు మావోయిస్టు కార్యకలాపాలకు కీలక స్థావరంగా, అత్యంత సున్నిత ప్రాంతంగా పేరొందిన కర్రెగుట్టల్లో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కర్రెగుట్టలను తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ సందర్శించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ అధికారుల బృందం అధికారికంగా కర్రెగుట్టలపైకి అడుగుపెట్టిందని డీజీపీ పేర్కొన్నారు.

అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు, గతంలో నెలకొన్న మావోయిస్టు ప్రభావం నేపథ్యంలో సాధారణ ప్రజలకు సైతం అందని ప్రాంతంగా ఉన్న కర్రెగుట్టల్లో డీజీపీ పర్యటన సాగింది. ఒకప్పుడు తుపాకుల మోత, బాంబుల పేలుళ్లతో అట్టుడికిన ఈ ప్రాంతంలో ఇప్పుడు పోలీసు అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. కర్రెగుట్టల్లో డీజీపీ సీవీ ఆనంద్‌ పర్యటన ఓ సాహస యాత్రను తలపించింది.

తెలంగాణలో ఎత్తైన కొండ.. డోలిగుట్ట ప్రత్యేకత ఇదే!

పర్వతారోహణ ప్రియులను ఆకట్టుకునే డోలిగుట్ట తెలంగాణలోని ఎత్తైన కొండల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. సముద్ర మట్టానికి సుమారు 964 మీటర్ల ఎత్తులో ఉన్న డోలిగుట్ట.. కర్రెగుట్టల పర్వత శ్రేణిలో ఒక భాగం. ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, మారుమూల ప్రాంతం కావడంతో గతంలో ఈ ప్రాంతం మావోయిస్టులకు సురక్షిత స్థావరంగా ఉండేది.

కర్రెగుట్టలను మావోయిస్టులు షెల్టర్ జోన్‌గా వినియోగించుకునేవారు. దట్టమైన అటవీ ప్రాంతంలో డెన్‌లను ఏర్పాటు చేసుకుని తమ కార్యకలాపాలను కొనసాగించేవారు. దీంతో ఒకప్పుడు సాధారణ ప్రజలు, అధికారులు సైతం అడుగుపెట్టేందుకు భయపడే పరిస్థితి ఉండేది.

అయితే ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయి. మావోయిస్టు కార్యకలాపాలకు చెక్ పడటంతో కర్రెగుట్టల్లో శాంతి, అభివృద్ధికి మార్గం సుగమమవుతోంది. ఒకప్పుడు భయానక ప్రాంతంగా పేరొందిన ఈ గుట్టలు.. ఇప్పుడు ప్రకృతి అందాలు, పర్వతారోహణకు అనువైన ప్రాంతాలుగా కొత్త గుర్తింపు దిశగా అడుగులు వేస్తున్నాయి.

కర్రెగుట్టల్లోకి ప్రభుత్వ అధికారుల బృందం రావడం ఇదే తొలిసారి అని డీజీపీ సీవీ ఆనంద్ గుర్తుచేశారు. గతంలో గ్రేహౌండ్స్, కోబ్రా, సీఆర్‌పీఎఫ్‌ దళాలు మాత్రమే కూంబింగ్‌ ఆపరేషన్ల కోసం గుట్టల్లోకి వెళ్లి తిరిగి వచ్చేవని తెలిపారు. అయితే గత రెండేళ్లుగా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర పోలీసు బలగాలతో పాటు కేంద్ర భద్రతా బలగాల సమన్వయంతో చేపట్టిన ఖగార్‌ ఆపరేషన్లతో కర్రెగుట్టల్లో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందన్నారు.

మావోయిస్టు అగ్రనేతలు, కీలక దళ సభ్యులు లొంగిపోవడం.. మరికొందరు భద్రతా బలగాల ఆపరేషన్లలో మృతి చెందడం.. ఇంకొందరు ఆయుధాలు వదిలి ప్రభుత్వానికి లొంగిపోవడంతో ఈ ప్రాంతంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని డీజీపీ పేర్కొన్నారు. ఒకప్పుడు మావోయిస్టులకు సురక్షిత స్థావరంగా ఉన్న కర్రెగుట్టల్లో ఇప్పుడు ప్రశాంత వాతావరణం నెలకొందని తెలిపారు.

కర్రెగుట్టల్లో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది.. ఇంతకాలం భద్రతా కారణాలతో దూరంగా ఉన్న ప్రాంతంలో ఇప్పుడు అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి.. “కర్రెగుట్టలపైకి ములుగు జిల్లా కలెక్టర్ ఇతర అధికార బృందంతో కలిసి చేరుకున్న డిజిపి శాంతి కపోతాలు పావురాలను ఎగురవేశారు.. జాతీయ జెండాను ఆవిష్కరించి ఆనందంతో మురిసిపోయారు. అధికారులతో కలిసి జాతీయ జెండా ఎగురవేయడం ఎంతో గర్వంగా ఉందని. ఇది చరిత్రలో నిలిచిపోయే రోజని డీజీపీ తెలిపారు.

కర్రెగుట్టల ప్రాంతానికి రాకపోకలు సులభతరం చేసేందుకు గత ఆరు నెలలుగా అధికారులు తీవ్రంగా శ్రమించారు. వెంకటాపురం మండలంలోని పామునూరు, మురుమూరు, జల్లా, డోలి, తడపాల వరకు సుమారు 33 కిలోమీటర్ల తెలంగాణ సరిహద్దులో మట్టి రోడ్డు నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఏర్పాటైన ఈ రహదారిని మరింత అభివృద్ధిచేసి రాబోయే రోజుల్లో కర్రెగుట్టల వరకు బీటీ రోడ్డు నిర్మించే దిశగా చర్యలు తీసుకుంటామని డీజీపీ వెల్లడించారు. రహదారి సౌకర్యం అందుబాటులోకి వస్తే రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు మెరుగుపడటంతో పాటు ప్రభుత్వ సేవలు కూడా సులభంగా చేరే అవకాశం ఉందన్నారు.

కర్రెగుట్టల సహజ అందాలను ఉపయోగించుకుని పర్యాటక అభివృద్ధికి అవకాశాలను పరిశీలిస్తున్నామని డీజీపీ తెలిపారు. ఇక్కడ నివసించే గిరిజనులకు ఆదాయం పెరిగేలా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశాలపై విశ్లేషణ జరుగుతోందన్నారు.. స్థానిక ప్రజలకు ప్రయోజనం చేకూరేలా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు వారికి జీవనోపాధి కల్పించే అంశాలను ప్రాధాన్యంగా తీసుకుంటామన్నారు.

బాహ్య ప్రపంచానికి దూరంగా కర్రెగుట్టలపై నివశిస్తున్న పామునూరు గ్రామస్తులకు డీజీపీ సీవీ ఆనంద్‌, జిల్లా కలెక్టర్, ఇతర పోలీస్ అధికారాల చేతుల మీదుగా నిత్యావసర సరుకులు, దుస్తులను పంపిణీ చేశారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి అవసరాలు, జీవన పరిస్థితులపై ఆరా తీశారు. పోలీసు శాఖ ప్రజలకు అండగా ఉంటుందని, మారుమూల ప్రాంతాల అభివృద్ధికి సహకరిస్తామని భరోసా ఇచ్చారు.

మావోయిస్టులు లొంగిపోవడం తర్వాత వారి పునరావాసం, ఉపాధి, జీవనాధారం వంటి అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందని డీజీపీ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి.. వారు ఇకపై ఏం చేయాలనుకుంటున్నారు..!, వారికి ఎలాంటి ఉపాధి కల్పించాలి.. సమాజంలో సాధారణ జీవితం ఎలా కొనసాగించాలనే అంశాలపై చర్చించి వారికి హెల్త్ కార్డ్స్ అందజేయనున్నట్లు డీజీపీ వెల్లడించారు.

ఇంకా మావోయిస్టు సెంట్రల్ కమిటీకి చెందిన సభ్యులు సహా కొద్దిమంది అగ్రనేతలు మిగిలి ఉన్నారని డీజీపీ తెలిపారు. సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతితోపాటు ఆయన భార్య కూడా లొంగిపోయి సాధారణ జీవితం గడపాలని సూచించారు. అలాగే వివిధ రాష్ట్రాలకు చెందిన, సెంట్రల్ కమిటీ స్థాయిలో ఉన్న మరో 17 మంది మావోయిస్టులు కూడా ఆయుధాలు వదిలి ప్రభుత్వానికి లొంగిపోవాలని సీవీ ఆనంద్ పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...