
వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు హత్యాయత్నం కింద నమోదైన కేసును, ఆమె మృతి చెందడంతో హత్య కేసుగా మార్చారు. ఈ మేరకు కేసులోని సెక్షన్లను పోలీసులు సవరించారు. గతంలో నమోదు చేసిన BNS సెక్షన్ 110ను తాజాగా BNS సెక్షన్ 106గా మార్చినట్లు వెల్లడించారు. దీంతో కేసు దర్యాప్తు మరింత కీలకంగా మారింది.
నిందితుల కస్టడీకి పోలీసుల ప్రయత్నం
ప్రస్తుతం ఈ కేసులో ఇద్దరు నిందితులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్నారు. వారిని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. దర్యాప్తులో భాగంగా నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ రాజమహేంద్రవరం కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.
నిందితులను పోలీసుల కస్టడీలోకి తీసుకుని విచారిస్తే ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, ఇతర కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కోర్టు నిర్ణయం అనంతరం నిందితుల కస్టడీపై స్పష్టత రానుంది.
కిమ్స్‌లో ప్రియాంక మృతదేహం
ప్రియాంక మృతదేహాన్ని ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. ఇప్పటికే రాజమహేంద్రవరం నుంచి పోలీసులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. కిమ్స్‌లో శవ పంచనామా పూర్తిచేసిన అనంతరం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించనున్నారు.
అక్కడ ప్రియాంక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ప్రియాంక తల్లిదండ్రుల స్వస్థలం గద్వాల జిల్లా అయిజ మండలంలోని ఎక్లాస్పూర్. అయితే ఆమె కుటుంబం చాలా కాలంగా హైదరాబాద్‌లోనే నివసిస్తోంది.
రూ.20 లక్షల ఆర్థిక సాయం
ప్రియాంక మృతితో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తమ కలల సౌధం కూలిపోయిందంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
మద్యం మత్తులో కారు నడపడంతో ప్రమాదం
రాజమహేంద్రవరంలో ఇద్దరు యువకులు మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి ఢీకొన్న ఘటనలో మెడికో ప్రియాంక తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం అనంతరం ఆమెను చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం 3:32 గంటలకు ప్రియాంక తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో పోలీసులు కేసులో సెక్షన్లను మార్చి దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.

