భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ముందు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు రూపొందించిన ఓ ప్రచార వీడియో వివాదానికి కారణమైంది. ఈ వీడియోలో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK), గిల్గిట్-బల్టిస్థాన్ ప్రాంతాలను భారత భూభాగంలో భాగంగా చూపించినట్లు సమాచారం. దీంతో భారత్-పాకిస్థాన్ మధ్య మరోసారి దౌత్యపరమైన చర్చకు దారితీసే పరిస్థితి ఏర్పడింది.

ఈ మ్యాప్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పాకిస్థాన్ విదేశాంగ శాఖ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు పాకిస్థాన్ ప్రభుత్వం ఈ అంశంపై ఎలాంటి అధికారిక చర్యను ప్రకటించలేదు. అయితే ఈ విషయాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ మధ్య ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సరిహద్దు ఘర్షణలు, వైమానిక దాడుల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. పాకిస్థాన్‌లో జరుగుతున్న దాడులకు తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) కారణమని ఇస్లామాబాద్ ఆరోపిస్తోంది. అఫ్గాన్ తాలిబన్ ప్రభుత్వం TTPకు ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్థాన్ పదేపదే ఆరోపణలు చేస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో అఫ్గాన్ క్రికెట్ బోర్డు ప్రచార వీడియోలోని మ్యాప్ వివాదం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ అంశంపై అఫ్గాన్ క్రికెట్ బోర్డు నుంచి అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది.

ఇక భారత్-అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ విషయానికి వస్తే.. సెప్టెంబర్ 13 నుంచి దిల్లీలో మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌కు అఫ్గానిస్థాన్ ఆతిథ్య హోదాలో వ్యవహరిస్తోంది. కీలకమైన ఈ క్రికెట్ సిరీస్‌కు ముందు తలెత్తిన మ్యాప్ వివాదం ఇప్పుడు క్రికెట్ వర్గాలతో పాటు దౌత్య వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *