
ఒక సినిమా భారీ విజయాన్ని అందుకుంటే కథానాయికలు వరుసగా కొత్త ప్రాజెక్టులకు సంతకాలు చేయడం సాధారణం. అయితే బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించారు. తన కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘స్త్రీ 2’ తర్వాత భారీ పారితోషికాలు, ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ.. మనసుకు నచ్చిన కథ కోసం ఎదురుచూశానని ఆమె వెల్లడించారు.
2024లో విడుదలైన ‘స్త్రీ 2’ ప్రపంచవ్యాప్తంగా రూ.875 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత తనకు ఎదురైన అనుభవాలను శ్రద్ధా తాజాగా సోషల్ మీడియాలో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్‌లో అభిమానులతో పంచుకున్నారు.
మనసుకు నచ్చిన కథ కోసం ఎదురుచూపులు
కెరీర్‌లో ఎదగాలనుకునే యువతులకు ఎలాంటి సలహా ఇస్తారని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు శ్రద్ధా సమాధానమిచ్చారు. ‘స్త్రీ 2’ విజయం తర్వాత తనకు చాలా సినిమా అవకాశాలు వచ్చాయని, మంచి పారితోషికాలు కూడా ఆఫర్ చేశారని తెలిపారు. అయినప్పటికీ, తనకు నచ్చిన కథ దొరికే వరకు కొత్త సినిమాలకు అంగీకరించకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
“నా అనుభవాన్నే చెబుతాను. ‘స్త్రీ 2’ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. మంచి పారితోషికాలు కూడా ఆఫర్ చేశారు. కానీ మనసుకు నచ్చిన కథ దొరికే వరకు ఓపికగా ఎదురుచూడాలని నిర్ణయించుకున్నా. అనుకున్నట్లే చేశా. మీ మనసు చెప్పేది వినండి. కొన్నిసార్లు అది కష్టంగా అనిపించినా.. చివరికి తగిన ఫలితం ఉంటుంది” అని శ్రద్ధా పేర్కొన్నారు.
‘ఈఠా’తో ప్రేక్షకుల ముందుకు
ప్రస్తుతం శ్రద్ధా కపూర్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఈఠా’ (Eetha) చిత్రంలో నటిస్తున్నారు. ప్రముఖ లావణి కళాకారిణి విఠాబాయి నారాయణ్ గావ్కర్ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
విభిన్నమైన కథతో రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. డిసెంబర్ 4న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
