ఫ్యాటీ లివర్ సమస్య అంటే మద్యం ఎక్కువగా సేవించే వారికే వస్తుందని చాలామంది భావిస్తుంటారు. అయితే, మద్యం అసలు తాగని వారిలో కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి మద్యపానమే ఏకైక కారణం కాదు. ఆహారపు అలవాట్లు, అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం, మధుమేహం, ఇన్సులిన్ నిరోధకత వంటి ఇతర కారణాలు కూడా ఫ్యాటీ లివర్‌కు దారితీయవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కాలేయం మన శరీరంలో కీలక పాత్ర పోషించే అవయవం. ఆహారం జీర్ణం కావడానికి సహాయపడటం, శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించడం, రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే, ప్రస్తుతం చాలామందిలో కాలేయంలో కొవ్వు పేరుకుపోయే ఫ్యాటీ లివర్ సమస్య ఆందోళన కలిగిస్తోంది. మద్యం తాగే వారికే ఈ సమస్య వస్తుందని చాలామంది భావిస్తుంటారు. కానీ మద్యం అలవాటు లేని వారిలోనూ ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, అధిక బరువు వంటి అంశాలు కూడా ఈ సమస్యకు కారణమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మద్యం సేవించని వారిలోనూ కాలేయంలో కొవ్వు పేరుకుపోవచ్చు. దీనికి ప్రధానంగా జీవక్రియల్లో మార్పులు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి అంశాలు కారణమవుతాయి. ఈ పరిస్థితిని మెటబాలిక్ డిస్ఫంక్షన్-అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ (MASLD) అని పిలుస్తారు. గతంలో ఈ సమస్యను నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD)గా పేర్కొనేవారు.
ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, అధిక బరువు, టైప్-2 డయాబెటిస్, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ల స్థాయులు పెరగడం, ఇన్సులిన్ నిరోధకత వంటి సమస్యలు ఫ్యాటీ లివర్ ముప్పును పెంచుతాయి. బయటకు సన్నగా కనిపించే వారిలోనూ శరీరంలో అంతర్గత కొవ్వు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి బరువు సాధారణంగా ఉన్నప్పటికీ ఈ సమస్య వచ్చే ప్రమాదాన్ని పూర్తిగా కొట్టిపారేయలేం.
అలాగే తెల్ల బియ్యం, స్వీట్లు, చక్కెర కలిపిన పానీయాలు, వేయించిన పదార్థాలు, ప్యాకెట్ ఆహారాలను అధికంగా తీసుకోవడం, ఎక్కువసేపు కూర్చుని ఉండటం, శారీరక వ్యాయామం లేకపోవడం, తగినంత నిద్రపోకపోవడం వంటివి కూడా ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని పెంచవచ్చు. ఈ సమస్య ప్రారంభ దశలో సాధారణంగా ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. కొందరిలో అలసట, నీరసం, పొత్తికడుపు కుడివైపు పైభాగంలో అసౌకర్యం ఉండవచ్చు. వ్యాధి ముదిరినప్పుడు కాళ్లు, పొట్ట వాపు, కామెర్లు వంటి లక్షణాలు కనిపించవచ్చు. అందువల్ల సమతుల ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బరువును నియంత్రణలో ఉంచుకోవడం వంటి జీవనశైలి మార్పులు అవసరం. అనుమానాస్పద లక్షణాలు కనిపించినా, ప్రమాద కారకాలు ఉన్నా వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం మంచిది.
