
ఐపీఎల్‌లో మరో కీలక ఆటగాళ్ల బదిలీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ (MI) కెప్టెన్ హార్దిక్ పాండ్య ఆ జట్టును వీడనున్నట్లు సమాచారం. హార్దిక్‌తో పాటు పంజాబ్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను కలుపుతూ ఇరు ఫ్రాంచైజీల మధ్య ట్రేడ్ ఒప్పందం కుదిరినట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ.. ఈ విషయాన్ని రెండు జట్లు ఇప్పటికే బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఆడేందుకు హార్దిక్ ఓకే!
ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్య.. పంజాబ్ కింగ్స్‌కు మారిన తర్వాత శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఆడేందుకు అంగీకరించినట్లు సమాచారం. మరోవైపు అర్ష్‌దీప్ సింగ్‌ను వదులుకోవడానికి పంజాబ్ యాజమాన్యం తొలుత ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. అయితే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కోచ్ రికీ పాంటింగ్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని హార్దిక్‌ను జట్టులోకి తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ముంబైని వీడాలని ముందే నిర్ణయం?
పంజాబ్ కింగ్స్ తరఫునే ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్ సింగ్ గత ఏడేళ్లుగా అదే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అలాంటి కీలక బౌలర్‌ను ట్రేడ్ చేయడం పంజాబ్‌కు పెద్ద నిర్ణయమే. మరోవైపు ఈ ఏడాది ఐపీఎల్ ముగిసిన వెంటనే ముంబై ఇండియన్స్‌ను వీడాలనే తన నిర్ణయాన్ని హార్దిక్ యాజమాన్యానికి తెలియజేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. దీంతో అతడి కోసం ఆర్సీబీ సహా పలు ఫ్రాంచైజీలతో ముంబై చర్చలు జరిపినట్లు సమాచారం.
నవంబర్ 17తో ట్రేడ్స్‌కు గడువు
ఐపీఎల్ 2027 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల బదిలీలు, రిటెన్షన్ ప్రక్రియ నవంబర్ 17తో ముగియనుంది. అనంతరం డిసెంబర్ 16న గోవా వేదికగా మినీ వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు తమ జట్లలో అవసరమైన మార్పులు చేసుకుంటున్నాయి. హార్దిక్ పాండ్య, అర్ష్‌దీప్ సింగ్‌ల బదిలీపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రస్తుతానికి ఈ ఒప్పందానికి సంబంధించి ఫ్రాంచైజీల నుంచి అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంది.
