తెలంగాణకు చెందిన యువ క్రీడాకారిణి తాళ్లూరి నయనశ్రీ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ప్రపంచ జూనియర్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీకి అర్హత సాధించిన తొలి భారత మహిళా స్కేటర్‌గా నిలిచింది.

500 మీటర్ల రేసులో అద్భుత ప్రదర్శన

ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం మోటమర్రి గ్రామానికి చెందిన నయనశ్రీ.. ఇటలీలోని బోర్మియోలో జరిగిన జూనియర్ ప్రపంచకప్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. 500 మీటర్ల రేసును కేవలం 44.144 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో చోటు దక్కించుకుంది. ఈ విజయంతో భారత స్కేటింగ్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

కెనడాలో శిక్షణ

ప్రస్తుతం నయనశ్రీ కెనడాలోని కాల్గరీలో ప్రత్యేక శిక్షణ పొందుతోంది. అంతర్జాతీయ స్థాయిలో మరింత మెరుగైన ప్రదర్శన చేయడమే లక్ష్యంగా సాధన కొనసాగిస్తోంది. తెలంగాణలోని ఓ చిన్న గ్రామం నుంచి ప్రపంచ వేదికపైకి ఎదిగిన నయనశ్రీ విజయం రాష్ట్రానికే గర్వకారణంగా నిలుస్తోంది.