పుష్ప 2’ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు అట్లీతో కలిసి ‘రాకా’ అనే భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌లో బన్నీ గత కొంతకాలంగా బిజీగా ఉన్నారు. ఎక్కువ భాగం చిత్రీకరణ ముంబైలో జరుగుతుండటంతో హైదరాబాద్, ముంబై మధ్య తరచూ ప్రయాణాలు చేస్తున్నారు. అయితే త్వరలోనే ఈ ప్రయాణాలకు కొంత విరామం లభించనుంది. తాజా సమాచారం ప్రకారం.. ముంబై షెడ్యూల్ ముగిసిన తర్వాత ‘రాకా’ చిత్రబృందం హైదరాబాద్‌కు రానున్నట్లు తెలుస్తోంది.

రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ యాక్షన్ సీన్స్

ప్రస్తుతం ముంబైలో ‘రాకా’ తాజా షెడ్యూల్ కొనసాగుతోంది. ఇది పూర్తయిన వెంటనే హైదరాబాద్‌లో తదుపరి షెడ్యూల్ ప్రారంభించేందుకు దర్శకుడు అట్లీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించనున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

వాస్తవానికి ఈ యాక్షన్ సన్నివేశాలను దుబాయ్‌లో తెరకెక్కించాలని తొలుత భావించారట. అయితే అక్కడి పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రణాళికను మార్చుకుని హైదరాబాద్‌లోనే షూటింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత విదేశాల్లో తదుపరి చిత్రీకరణ చేపట్టనున్నట్లు సమాచారం.

రూ.1,000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రాకా’

‘రాకా’ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో రూపొందించేందుకు అట్లీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌పై ఉన్న అంచనాల నేపథ్యంలో సన్ పిక్చర్స్ ఈ సినిమాను సుమారు రూ.1,000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో బన్నీ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

వచ్చే ఏడాది చివర్లో విడుదలకు ప్లాన్?

ఇప్పటివరకు ఈ సినిమా చిత్రీకరణ దాదాపు 40 నుంచి 50 శాతం పూర్తయినట్లు టాక్. వచ్చే ఏడాది వేసవి నాటికి షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి, 2027 చివర్లో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే షూటింగ్ షెడ్యూల్స్, విడుదల తేదీపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బన్నీని అట్లీ ఎలాంటి కొత్త అవతారంలో చూపించబోతున్నారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.