
“సావు నుండైనా నీకోసం వస్తాన్నాన” అంటూ రష్మిక మందన్న నటిస్తున్న ‘మైసా’ సినిమా ఆసక్తిని పెంచుతోంది. రష్మిక టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్, అనిల్ సయ్యపురెడ్డి, వీరసాయి గోప నిర్మిస్తున్నారు. సముద్రఖని, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది.
యాక్షన్ అవతార్‌లో రష్మిక
సినిమా ప్రచారంలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో ‘మైసా’ టీజర్‌ను విడుదల చేశారు. “యుద్ధానికి ఆయుధమంటే భయం.. కానీ ఆయుధం ఏ యుద్ధానికీ భయపడదు” అంటూ రష్మిక పాత్రను పరిచయం చేసిన విధానం ఆకట్టుకుంది. టీజర్‌లో మైసా పాత్రలో రష్మిక చేసిన యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ప్రాణం పెట్టి పనిచేశా: రష్మిక
ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. ఇప్పటివరకు తాను చేయని జానర్‌లో ‘మైసా’ చేశానని చెప్పారు. తొలిసారి ఇలాంటి యాక్షన్ చిత్రంలో నటించానని, టీజర్ చూసిన తర్వాత ప్రేక్షకులు ఆశ్చర్యపోయి ఉంటారని అన్నారు. ట్రైలర్‌లో కథను మరింత విస్తృతంగా చూపించనున్నట్లు తెలిపారు.
‘ది గర్ల్‌ఫ్రెండ్’ కోసం తనలోని భావోద్వేగాలను పూర్తిగా చూపించానని, ‘మైసా’ కోసం మాత్రం తన జీవితాన్నే పెట్టి పనిచేశానని రష్మిక పేర్కొన్నారు. స్క్రిప్ట్ విన్నప్పుడు చాలా ఉత్సాహంగా అనిపించిందని, అయితే దాన్ని తెరపైకి తీసుకురావడం అంత సులభం కాదని షూటింగ్ సమయంలో అర్థమైందన్నారు.
కేరళ అడవుల్లో చేసిన ఛేజింగ్ సన్నివేశాలు, ఎత్తైన జలపాతం నుంచి దూకే సీన్లు, అండర్‌వాటర్ యాక్షన్, బురదలో చిత్రీకరించిన ఫైట్ సీక్వెన్స్‌లు ఎంతో సవాలుగా నిలిచాయని చెప్పారు. వీటన్నింటినీ సహజంగా చూపించేందుకు చిత్రబృందం ఎంతో శ్రమించిందన్నారు. సినిమాలోని ఓ పాటకు డ్యాన్స్ చేస్తున్న సమయంలో తనకు గాయమైందని, మరో 12 రోజుల షూటింగ్‌తో సినిమా పూర్తవుతుందని తెలిపారు.
గోండు గిరిజనుల నేపథ్యంలో కథ
దర్శకుడు రవీంద్ర పుల్లె మాట్లాడుతూ.. ‘మైసా’ కథ గోండు గిరిజన తెగ నేపథ్యంగా సాగుతుందని చెప్పారు. వారి సంప్రదాయాల్లోని ‘గుస్సాడీ’ అనే దీక్షను సినిమాలో ఎంతో సహజంగా, అథెంటిక్‌గా చూపించే ప్రయత్నం చేశామని తెలిపారు.
రష్మికను దృష్టిలో పెట్టుకునే ఈ కథను రాశామని దర్శకుడు వెల్లడించారు. ఇప్పటివరకు ప్రేక్షకులు రష్మికను ఎక్కువగా క్యూట్, స్వీట్ పాత్రల్లో చూశారని.. ‘మైసా’లో మాత్రం ఆమెను పూర్తిగా భిన్నమైన యాక్షన్ అవతార్‌లో చూస్తారని చెప్పారు. సినిమాలో ఆమె పాత్రపై రక్తం పడేంతగా యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని, అదే కొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు పేర్కొన్నారు.
