
విశాఖపట్నం నగరానికి సంబంధించి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కీలక ప్రకటన చేశారు. త్వరలో విశాఖలో 16 ఫైవ్ స్టార్ హోటళ్లు అందుబాటులోకి రానున్నాయని ఆయన వెల్లడించారు. కొత్త హోటళ్ల ఏర్పాటుతో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందడంతో పాటు వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని తెలిపారు.
విశాఖలో నిర్వహిస్తున్న MSME బిజినెస్ ఎక్స్‌పో-2026ను మంత్రి కందుల దుర్గేష్‌తో కలిసి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఎక్స్‌పోలో 180కి పైగా ఎగ్జిబిటర్లు, 60కి పైగా స్టార్టప్‌లు, 50 ఆర్థిక సంస్థలు పాల్గొంటున్నాయి.
ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విశాఖపట్నం ఇప్పటికే ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిందన్నారు. నగరంలో పర్యాటక రంగాన్ని మరింత విస్తరించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. ఇందులో భాగంగా కొత్త ఫైవ్ స్టార్ హోటళ్లు, వ్యాపార సంస్థలు, పర్యాటక మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు.
16 ఫైవ్ స్టార్ హోటళ్ల ఏర్పాటుతో విశాఖకు దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల రాక మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. హోటళ్లు, ఆతిథ్య రంగం విస్తరించడం ద్వారా స్థానికంగా ఉపాధి, వ్యాపార అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతాయని తెలిపారు.
మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి చర్యలు కొనసాగుతున్నాయని గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖను పర్యాటక, పారిశ్రామిక, వాణిజ్య కేంద్రంగా మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
