గుడ్లు తక్కువ ధరకే శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందించే ఆహార పదార్థాల్లో ముఖ్యమైనవి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ప్రోటీన్‌తో పాటు విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. అయితే మార్కెట్లో తెల్ల గుడ్లు, బ్రౌన్ గుడ్లు అనే రెండు రకాల గుడ్లు ఎక్కువగా కనిపిస్తాయి. వీటిలో బ్రౌన్ గుడ్లలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని చాలామంది భావిస్తారు. మరి ఈ నమ్మకంలో నిజమెంత? తెల్ల గుడ్లకు, బ్రౌన్ గుడ్లకు మధ్య అసలు తేడా ఏమిటి? పోషకాల పరంగా రెండింటిలో ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా? ఈ వివరాలను తెలుసుకుందాం.

గుడ్ల పెంకు రంగు మారినంత మాత్రాన వాటిలోని పోషకాలు కూడా మారిపోతాయని అనుకోవడం పొరపాటు. తెల్లగుడ్లు, బ్రౌన్ గుడ్ల మధ్య రంగులో తేడా ఉండటానికి ప్రధాన కారణం కోడి జాతి, జన్యువులే. గుడ్డు తయారయ్యే చివరి దశలో కొన్ని కోళ్ల గుడ్ల పెంకుపై ప్రోటోపోర్ఫిరిన్ అనే వర్ణద్రవ్యం చేరడం వల్ల అవి గోధుమ రంగులో కనిపిస్తాయి.
తెల్లగుడ్లు, బ్రౌన్ గుడ్లలో పోషకాలు ఒకేలా ఉంటాయా?
చాలామంది తెల్లగుడ్ల కంటే బ్రౌన్ గుడ్లలో ఎక్కువ పోషకాలు ఉంటాయని భావిస్తారు. అయితే ఈ రెండింటిలోనూ పోషక విలువలు దాదాపు సమానంగా ఉంటాయి. గుడ్డు పరిమాణాన్ని బట్టి కేలరీలు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్ల పరిమాణంలో స్వల్ప తేడాలు ఉండవచ్చు. కానీ కేవలం పెంకు రంగును బట్టి గుడ్డులోని పోషకాలను అంచనా వేయలేం.
గుడ్డులోని పోషకాలను ప్రభావితం చేసేది ఏంటి?
గుడ్డులోని పోషకాలపై కోడి తీసుకునే ఆహారం, పెరిగే పరిస్థితులు వంటి అంశాలు ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే ఆహారం తీసుకునే కోళ్లు పెట్టే గుడ్లలో ఈ పోషకాలు ఎక్కువగా ఉండవచ్చు. అలాగే కోడి ఆహారాన్ని బట్టి గుడ్డులోని పచ్చసొన రంగు, కొన్ని పోషకాల స్థాయులు మారవచ్చు.
బ్రౌన్ గుడ్లు ఎందుకు ఖరీదుగా ఉంటాయి?
తెల్లగుడ్లతో పోలిస్తే బ్రౌన్ గుడ్లు కొన్ని చోట్ల ఎక్కువ ధరకు లభిస్తాయి. దీనికి కారణం వాటిలో ప్రత్యేకంగా ఎక్కువ పోషకాలు ఉండటం కాదు. బ్రౌన్ గుడ్లు పెట్టే కొన్ని కోళ్ల జాతులు పరిమాణంలో పెద్దవిగా ఉండటం, వాటి పోషణకు ఎక్కువ దాణా అవసరం కావడం వంటి అంశాలు ధరపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి బ్రౌన్ గుడ్లే ఆరోగ్యానికి మంచివని భావించడం సరైనది కాదు.
రుచిలోనూ తేడా ఉంటుందా?
తెల్లగుడ్లు, బ్రౌన్ గుడ్ల రుచిలో సాధారణంగా పెద్దగా తేడా ఉండదు. కోడి ఆహారం, గుడ్డు తాజాదనం, వండే విధానం వంటి అంశాలు రుచిని ప్రభావితం చేస్తాయి. ఉడికించిన గుడ్లు, హాఫ్ బాయిల్ లేదా ఇతర వంటకాల్లో రుచి అనుభవం మారవచ్చు.
కాబట్టి గుడ్లు కొనేటప్పుడు వాటి పెంకు రంగు కంటే తాజాదనం, నాణ్యత, నిల్వ పరిస్థితులకు ప్రాధాన్యం ఇవ్వండి. తెల్లగుడ్డు అయినా, బ్రౌన్ గుడ్డు అయినా సమతుల ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. గుడ్డు రంగును బట్టి దాని పోషక విలువలను నిర్ణయించడం సరికాదని గుర్తుంచుకోండి.
