కన్యాకుమారికి చెందిన యూట్యూబర్ మధుమిత తన ఇంట్లో ఉన్న భారీ మొత్తంలో బంగారం, కోటి రూపాయల నగదును వీడియోల ద్వారా చూపించినట్లు సమాచారం. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దొంగల దృష్టిని ఆకర్షించినట్లు తెలుస్తోంది. అనంతరం ఆమె ఇంట్లోకి చొరబడిన దుండగులు సుమారు 960 గ్రాముల బంగారం, కోటి రూపాయల నగదును అపహరించినట్లు సమాచారం. ఈ ఘటనపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఇంట్లోని విలువైన వస్తువులు, నగదును బహిరంగంగా ప్రదర్శించడం వల్ల భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

ఇంట్లో డబ్బులు, బంగారు నగలు ఉన్నా వాటిని వీలైనంత జాగ్రత్తగా, గోప్యంగా ఉంచుకోవడం సాధారణం. కానీ ఇంట్లో భారీగా నగలు, కోట్ల రూపాయల నగదు ఉందంటూ సోషల్ మీడియాలో బహిరంగంగా చూపిస్తే.. ఆ సమాచారం ఇతరుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంటుంది. తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన ఓ యూట్యూబర్ విషయంలో ఇదే జరిగిందని పోలీసులు తెలిపారు. ఆమె ఇంట్లో జరిగిన భారీ చోరీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
కన్యాకుమారి ప్రాంతానికి చెందిన మధుమిత అనే వివాహిత యూట్యూబ్లో వీడియోలు చేస్తూ గుర్తింపు పొందింది. తన ఇంట్లో ఉన్న బంగారం, నగదుకు సంబంధించిన వీడియోలను కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు సమాచారం. ప్రతి నెలా ఇంట్లోని డబ్బుతో బంగారం కొనుగోలు చేస్తున్నామని చెబుతూ.. భారీగా బంగారు నగలు ఉన్నాయంటూ కొన్ని వీడియోల్లో చూపించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పూజ గదిలో నగదు, బంగారు ఆభరణాలను ఉంచి పూజలు చేస్తున్న దృశ్యాలను కూడా వీడియోలుగా తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసినట్లు సమాచారం.
ఈ వీడియోలు గుర్తుతెలియని వ్యక్తుల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెనుకవైపు తలుపును పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు.. సుమారు 960 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు దాదాపు రూ.కోటి నగదును చోరీ చేసినట్లు సమాచారం.
ఇంటికి తిరిగి వచ్చిన మధుమిత బంగారం, నగదు కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. విలువైన నగలు, నగదు వంటి వాటిని సోషల్ మీడియాలో బహిరంగంగా ప్రదర్శించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.
