
టాలీవుడ్ కమెడియన్ సత్య, కోలీవుడ్ కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘గోల్డెన్ భాగ్యం’. ‘రంగబలి’ ఫేమ్ పవన్ బాసంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. డ్రీమ్ మూవీ మేకర్స్, నయవాయు చిత్రాల బ్యానర్లపై నాగార్జున రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బాపి రెడ్డి, పవన్ బాసంశెట్టి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.
‘తెలుమిళ్ సినిమా’ అంటూ..
సత్య, యోగిబాబు కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘గోల్డెన్ భాగ్యం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. విడుదలైన గ్లింప్స్‌లో కామెడీకి పెద్దపీట వేయడంతో పాటు.. ఇద్దరు కమెడియన్ల మధ్య వచ్చే సన్నివేశాలు, డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. తెలుగు, తమిళ భాషలు, సంస్కృతులను కలిపి ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. ‘ఇది తెలుగు, తమిళ సినిమా కాదు.. తెలుమిళ్ సినిమా’ అంటూ యోగిబాబు చెప్పే డైలాగ్ గ్లింప్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కామెడీతో పాటు లవ్, క్రైమ్, యాక్షన్
పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో లవ్, క్రైమ్, యాక్షన్ అంశాలు కూడా ఉంటాయని దర్శకుడు పవన్ బాసంశెట్టి తెలిపారు. జయశ్రీ, అధిరాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. వెన్నెల కిశోర్, సుదర్శన్, కిశోర్ తిరుమల, రోహిణి, తనికెళ్ల భరణి, సునీల్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తెలుగు, తమిళ హాస్య నటుల కలయికలో రూపొందుతున్న ‘గోల్డెన్ భాగ్యం’ గ్లింప్స్ ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. మరి సత్య, యోగిబాబు కలిసి పూర్తి సినిమాలో ఎలాంటి కామెడీ పంచుతారో చూడాలి.
