
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు కీలక ఆటగాళ్ల మార్పిడికి అంగీకరించాయి. మొత్తం నలుగురు క్రికెటర్లు ఫ్రాంచైజీలు మారనున్నారు. ఈ ట్రేడ్‌ను ఐపీఎల్ అధికారికంగా వెల్లడించింది.
ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్స్టన్, ఆస్ట్రేలియా ఆటగాడు జాక్ ఎడ్వర్డ్స్ సన్‌రైజర్స్ నుంచి చెన్నై జట్టులోకి వెళ్లనున్నారు. మరోవైపు సీఎస్కేకు చెందిన భారత పేసర్ ఖలీల్ అహ్మద్, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎల్లిస్ హైదరాబాద్ జట్టులో చేరనున్నారు.
ఖలీల్ అహ్మద్‌కు రూ.4.8 కోట్లు
ఈ ట్రేడ్‌లో భాగంగా ఖలీల్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.4.8 కోట్ల ధరకు సొంతం చేసుకుంది. గతంలో 2018 నుంచి 2021 వరకు ఈ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన ఖలీల్.. ఇప్పుడు మరోసారి హైదరాబాద్ జెర్సీ ధరించనున్నాడు.
2025 ఐపీఎల్లో చెన్నై తరఫున 14 మ్యాచ్‌లు ఆడిన అతడు 15 వికెట్లు సాధించాడు. అయితే 2026 సీజన్లో ఐదు మ్యాచ్‌లు ఆడిన తర్వాత గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు.
లివింగ్స్టన్ ధరలో భారీ తగ్గింపు
ఆస్ట్రేలియా పేసర్ నాథన్ ఎల్లిస్‌ను హైదరాబాద్ రూ.2 కోట్లకు తీసుకుంది. మరోవైపు గత వేలంలో లియామ్ లివింగ్‌స్టన్‌ను రూ.13 కోట్లకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్.. ఇప్పుడు అతడిని రూ.6 కోట్లకు చెన్నైకి ట్రేడ్ చేయడం గమనార్హం.
ఆస్ట్రేలియా ఆటగాడు జాక్ ఎడ్వర్డ్స్ రూ.3 కోట్ల ధరతో సీఎస్కే జట్టులోకి చేరనున్నాడు. ఈ నలుగురి మార్పిడితో రెండు జట్ల కూర్పులో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
