
ఆంధ్రప్రదేశ్‌లో 2027 సెప్టెంబర్ నాటికి వంద శాతం అక్షరాస్యత సాధించే దిశగా అధికారులు పనిచేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ‘అక్షరాంధ్ర’ కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తోందని తెలిపారు.
2024 నాటికి రాష్ట్ర అక్షరాస్యత 72.6 శాతంగా ఉండగా.. కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఇప్పటివరకు 25 లక్షల మంది అక్షరాస్యులుగా మారారని లోకేశ్ చెప్పారు. బడి బయట ఉన్న 1,64,821 మంది పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల హాజరును ప్రస్తుతం ఉన్న 85.41 శాతం నుంచి మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
‘ఏఐ సమర్థ్’ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులకు ఏఐ టూల్స్‌పై ప్రత్యేక శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 125 ఆటిజం కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
