
ఆంధ్రప్రదేశ్లో మహిళలకు అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. త్వరలో రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో విద్యుత్ ఏసీ బస్సులు రానున్నాయని.. వాటిలోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం ఈ ప్రకటన చేశారు.
ప్రస్తుతం ‘స్త్రీ శక్తి’ పథకం కింద పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. పథకం అమలులోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా సీఎం తాజా నిర్ణయం ప్రకటించారు.
రవాణా వ్యవస్థను ఆధునీకరించేందుకు రాష్ట్రంలోకి త్వరలో పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను తీసుకురానున్నట్లు చంద్రబాబు తెలిపారు. బస్సుల సంఖ్య పెరగడంతో సెలవులు, పండగల సమయంలో రద్దీ సమస్య తగ్గే అవకాశం ఉంది. కేంద్రం కేటాయించిన విద్యుత్ బస్సులను విడతలవారీగా రాష్ట్రానికి తీసుకురానున్నారు. అవి అందుబాటులోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు.
మహిళలతో పాటు 40 శాతానికి పైగా వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ‘దివ్యాంగ శక్తి’ పథకం కింద ఉచిత ప్రయాణ సౌకర్యం అమల్లో ఉంది. దివ్యాంగులకు తోడుగా వచ్చే వ్యక్తికి టికెట్ ధరలో 50 శాతం రాయితీ కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ పథకం పలు సాధారణ బస్సు సర్వీసుల్లో అమలవుతోంది. దివ్యాంగులకు కూడా ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే అంశంపై ప్రభుత్వం త్వరలో స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
