ఏపీలో సర్పంచ్‌ ఎన్నికల వేళ ఓ అభ్యర్థిని వినూత్న హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అనంతపురం జిల్లా నేమకల్లు గ్రామ సర్పంచ్‌ అభ్యర్థి భాగ్య.. తాను గెలిస్తే గ్రామంలో పుట్టే ప్రతి ఆడపిల్ల పేరుపై రూ.10 వేల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయిస్తానని ప్రకటించారు. అంతేకాకుండా గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించడంతో పాటు, విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీలన్నింటినీ కేవలం మాటలకే పరిమితం చేయకుండా, రూ.10 బాండ్‌ పేపర్‌పై అగ్రిమెంట్‌గా రాసి నోటరీ చేయించడం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌లో సర్పంచ్‌ ఎన్నికల వేళ గ్రామాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓవైపు ఏకగ్రీవాల సందడి కొనసాగుతుండగా.. మరోవైపు అభ్యర్థులు వినూత్న హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలం నేమకల్లు గ్రామ సర్పంచ్‌ అభ్యర్థి కురుబ భాగ్య ఓటర్లకు అదిరిపోయే హామీ ఇచ్చారు. తాను గెలిస్తే పంచాయతీ పరిధిలో ఏ కుటుంబంలో ఆడపిల్ల జన్మించినా, ఆమె పేరుపై రూ.10 వేల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయిస్తానని ప్రకటించారు. అంతేకాదు.. తాను ఇచ్చిన ఎన్నికల హామీలను రూ.10 బాండ్‌ పేపర్‌పై అగ్రిమెంట్‌గా రాసి నోటరీ చేయించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకపోయినా సర్పంచ్‌ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు.

నేమకల్లు పంచాయతీ ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉండటంతో సర్పంచ్‌ అభ్యర్థి భాగ్య వినూత్న హామీలతో ఓటర్ల ముందుకు వచ్చారు. నేమకల్లు ఆంజనేయస్వామి సాక్షిగా ‘ప్రజాసేవ హామీ పత్రం’ పేరుతో బాండ్‌ పేపర్‌పై అగ్రిమెంట్‌ రాసిచ్చారు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం, వీధి దీపాల ఏర్పాటు, విద్యార్థులకు బస్సు సౌకర్యం, పాడి రైతులకు పశువుల మేత కోసం ఆర్థిక సాయం, గ్రంథాలయం ఏర్పాటు వంటి హామీలను అందులో పొందుపరిచారు. ఈ అగ్రిమెంట్‌పై భాగ్యతో పాటు ఆమె భర్త బసప్ప సంతకాలు చేశారు. సాక్షుల సంతకాలు తీసుకుని నోటరీ కూడా చేయించడం విశేషం.

ఇదే తరహాలో శ్రీకాకుళం జిల్లాలోనూ ఓ సర్పంచ్‌ అభ్యర్థిని బాండ్‌ పేపర్‌తో ప్రచారం చేస్తున్నారు. ఇచ్ఛాపురం మండలం కేసుపురం గ్రామ సర్పంచ్‌ అభ్యర్థిని గుజ్జు రిషా.. తన భర్త భీమరాజుతో కలిసి బాండ్‌ పేపర్‌ను ప్రజలకు చూపిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామంలోని ప్రజా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అగ్రిమెంట్‌ రూపంలో హామీ ఇచ్చారు. ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నారు. హామీలు నెరవేర్చకపోతే తనను నిలదీయాలని కూడా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. శ్రీసత్యసాయి జిల్లాలోనూ సర్పంచ్‌ ఎన్నికల వేళ మరో ఆసక్తికర హామీ తెరపైకి వచ్చింది. మడకశిర మండలం చందకచర్ల సర్పంచ్‌ పదవికి పోటీ చేయనున్న భూమానంద ఆశ్రమ వ్యవస్థాపకుడు ధనుంజయస్వామీజీ వినూత్న ఆఫర్‌ ప్రకటించారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామ పంచాయతీ ఖాతాలో రూ.1.50 కోట్లు జమ చేస్తానని వెల్లడించారు. చందకచర్ల తన స్వగ్రామమని, గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తన ఏకగ్రీవ ఎన్నికకు గ్రామస్థులంతా సహకరించి, మద్దతు ఇవ్వాలని కోరనున్నట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *