
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మద్యం అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఇప్పటివరకు 12 కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎం. మనోహర్ తెలిపారు. బుధవారం పట్టణంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని సమీక్ష నిర్వహించారు.
ఈ నెల 26న జరగనున్న ఆమదాలవలస మునిసిపాలిటీ ఎన్నికలు, 29న నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మద్యం అక్రమ రవాణా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీల్లో 12 మంది నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 14.4 లీటర్ల ఐఎంఎల్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా 48 మంది పాత నేరస్థులను సంబంధిత తహసీల్దార్ల ఎదుట హాజరుపరిచి బైండోవర్ చేసినట్లు తెలిపారు.
ఎన్నికల సమయంలో మద్యం అక్రమ రవాణా, విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు నిరంతరం నిఘా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ సీఐ జి. సతీష్‌కుమార్, ఎస్‌ఐలు కుమార్, కావ్య, అసిస్టెంట్ సూపరింటెండెంట్ పి. మురళీధర్ పాల్గొన్నారు.
